మండపేట : పట్టణ ప్రాంతాల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఏటా కేటాయించే ఆర్థిక సంఘం నిధులు నగర, పురపాలక సంస్థలకు ‘వాయిదా పడ్డ వరం’లా మిగులుతున్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదల తీరే అందుకు అద్దం పడుతోంది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులుగా జిల్లాకు రూ.1.72 కోట్లు విడుదల చేస్తూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా ఈ మూడేళ్లకు రూ.68.9 కోట్లకు పైగా రావాల్సి ఉంది.
ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక రెండు, మూడు వాయిదాల్లో ఈ నిధులను విడుదల చేయడం పరిపాటి. 13వ ఆర్థిక సంఘం 2010-11 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కాగా మొదటి ఏడాది మాత్రమే పూర్తిస్థాయిలో నిధులు విడుదలయ్యాయి. 2011-12 సంవత్సరానికి మొదటి వాయిదా నిధులు విడుదల చేసిన కేంద్రం తర్వాత ఆ ఊసే మరిచింది. నాటి నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరమూ వార్షిక కేటాయింపులు చేయడం, వాటితో చేపట్టే పనులకు ప్రతిపాదనలు కోరడం, నిధుల విడుదలను మరవడం రివాజుగా మారింది.
ప్రతిపాదనలే తప్ప పైకం లేదు..
జిల్లాలోని నగర, పురపాలక సంస్థలకు 13వ ఆర్థిక సంఘం 2012-13 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.19.38 కోట్లు, 2013-14 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.23.89 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రతిపాదనలను నగర, పురపాలక సంస్థలు పురపాలకశాఖ ద్వారా కేంద్రానికి పంపినా సొమ్ములు విడుదల కాలేదు. అప్పట్లో స్థానిక సంస్థల పాలకవర్గాలు లేకపోవడం, 2010-11 నిధుల వినియోగానికి సంబంధించి నివేదికల అందజేతలో జాప్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎన్నికల ముందు పట్టణ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లే అవుట్ రెగ్యులేజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)ల ద్వారా నగర, పురపాలక సంస్థలకు సమకూరిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వెచ్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గతనవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ నిధుల వినియోగానికి అనుమతులు మాత్రం ఇవ్వలేదు.
ఆ పనులకు కాలం చెల్లినట్టే..
రెండున్నరేళ్లుగా ఆర్థికసంఘం నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదించిన తాగునీటి వసతి, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరగక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. తాజాగా జిల్లాలోని ఏడు పట్టణాలకు 2011-12 ఆర్థిక సంవత్సరపు రెండో విడత నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు అందాయి. మండపేట మున్సిపాలిటీకి రూ.24.09 లక్షలు, అమలాపురానికి రూ.26.02 లక్షలు, తునికి రూ.25.47 లక్షలు, పిఠాపురానికి రూ.25.34 లక్షలు, సామర్లకోటకు రూ.27.11 లక్షలు, రామచంద్రపురానికి రూ. 20.92 లక్షలు, పెద్దాపురానికి రూ.23.02 లక్షలు విడుదలయ్యాయి.
అయితే గత రెండు ఆర్థిక సంవత్సరాలకు (2012-13, 2013-14) సంబంధించి జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కేటాయించిన రూ.43.27 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.25.63 కోట్లు విడుదల కానేలేదు. 2015-16 ఆర్థిక సంవత్స రం నుంచి 14వ ఆర్థిక సంఘం ప్రారంభం కానుం ది. అంటే 13వ ఆర్థిక సంఘం నిధులతో జరగాల్సిన పనులకు కాలం చెల్లినట్టేనంటున్నారు. ఇకనైనా కేంద్రం త్వరితగతిన నిధులు విడుదల చేయడం ద్వారా పట్టణాల్లో సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అందని చేయూత
Published Sat, Sep 27 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:00 PM
Advertisement
Advertisement