రాజధాని నిర్మాణానికి 1,00, 213 కోట్లు ఇవ్వండి
తిరుపతి : ప్రస్తుతం రాష్ట్రం సమస్యలతో సతమతం అవుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాధనకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు.
రాష్ట్రాన్ని ఆదుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా ఆర్థిక సంఘాన్ని కోరారు. రాజధాని నిర్మాణానికి 1,00, 213 కోట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉందని, అధికారుల పంపిణీ కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. సంక్షోభాన్ని అభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంటామన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచుతామన్నారు. అయిదు లేదా ఏడేళ్లలో ఏపీలో పూర్తిస్థాయి అక్షరాశ్యత సాధిస్తామన్నారు.