సాక్షి, హైదరాబాద్ : 2017–18 ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనుండటంతో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వం ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ అధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సదస్సుకు హాజరుకావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధానంగా ఏడు అంశాలకు సంబంధించిన వివరాలతో రావాలని ఎజెండాను విడుదల చేసింది. 2018–19 బడ్జెట్ రూపకల్పనకు అవసరమైన ప్రతిపాదనలు, ఆన్‌లైన్‌లో ప్రతిపాదనల సమర్పణను అత్యంత ప్రాధాన్యాంశంగా ఎజెండాలో పేర్కొన్నారు.
దీంతో పాటు రాష్ట్ర ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితిపై 15వ ఆర్థిక సంఘానికి పంపించాల్సిన నిర్ణీత నమూనాలు.. అందుకు అవసరమైన సమాచారం, కొత్త జిల్లాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, శాఖలు, ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగం, పెండింగ్‌లో ఉన్న యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, సెక్రటేరియట్‌లోని అన్ని శాఖల విభాగాధిపతి కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్ అమలు తీరు, జోన్లపై రాష్ట్రపతి ఉత్తర్వులు, దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులపై సమావేశంలో సమీక్ష జరుపుతారు.