ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదు! | Telangana ranks first among states with high per capita income | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదు!

Published Sat, Sep 21 2024 2:59 AM | Last Updated on Sat, Sep 21 2024 2:59 AM

Telangana ranks first among states with high per capita income

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దింది. అయితే ఆ పరిస్థితిని కాంగ్రెస్‌ మసిపూసి మారేడుకాయ చేస్తూ దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బీఆర్‌ఎస్‌ పాలనపై అబద్ధపు ప్రచారం మానలేదు. తాజాగా 16వ ఆర్థిక సంఘం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఉంచిన వివరాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్‌ తమ ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని దుఃస్థితిని కప్పిపుచ్చుకునేందుకు, తమ అసమర్థ  పాలన నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ప్రచారానికి దిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్‌ జాగ్రత్త!

తెలంగాణ ఉద్యమంలో ప్రజానీకం లేవ నెత్తిన అంశాల్లో ప్రధానమైంది ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాంతం వివక్షతకు గురికావడం. తెలంగాణలో విశేషమైన వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్ని రంగాలలో ఈ ప్రాంతం వెనుకబడింది. సాగునీటి వనరులు, ఉపాధి అవకాశాలు లేకుండా ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. తెలంగాణ వివక్షపై ఉద్యమించిన బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దింది.

ఎన్నికల ముందు, ఆ తరవాత కూడా బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను అప్పులకుప్పగా మార్చివేశారని, ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. నిరాధారమైన ఈ ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ నాయకులు, ఎప్పటికప్పుడు గణాంకాలతో సహా స్పష్టమైన వివర ణలు ఇస్తున్నప్పటికీ... వారు దుష్ప్రచారాన్ని మానడం లేదు. చివరకు ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు కూడా తెలంగాణ ఆర్థిక పరి స్థితిపై పచ్చి అబద్దాలను ఉంచారు.

ఈ విధంగా అవాస్తవాలతో మన ఆర్థిక సామర్థ్యాన్ని కించ పరుస్తూ ఉంటే, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వారిని భయ పెట్టడం మినహా ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా?కాంగ్రెస్‌ తమ ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని దుఃస్థితిని కప్పిపుచ్చుకునేందుకు, తమ అసమర్థ  పాలన నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దారుణంగా ప్రచారం చేయడం... తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే వారికి తగునా?

ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) విడుదల చేసిన నివేదికలో ఆర్థికంగా అన్ని కీలక కొలమానాలలోనూ తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కొట్టొచ్చినట్టు స్పష్టమౌతోంది. తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తులను దేశ లేదా రాష్ట్రాభివృద్ధికి కొల మానంగా తీసుకుంటాము. ఈ రెండింటిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే తెలంగాణ 94 శాతం ఎక్కువ నమోదు చేసింది. కర్ణాటక 81 శాతం మాత్రమే అధికంగా ఉంది.

తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కర్ణాటక, తమిళ నాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు దేశంలోనే ప్రధాన ఆర్థిక శక్తి కేంద్రాలుగా మారాయి. జాతీయ సగటుతో పోల్చితే తలసరి ఆదాయంలో తెలంగాణ 193.6 శాతం, కర్ణాటక 181 శాతం, తమిళనాడు 171 శాతం, కేరళ 152.5, ఆంధ్రప్రదేశ్‌ 131.6 శాతం అధికంగా ఉన్నాయి.

జీఎస్డీపీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి, సుసంపన్నమైన రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 2010–11లో ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం వాటా 4.6 శాతంఉండగా, తెలంగాణ ప్రాంతపు వాటా 3.8 శాతం మాత్రమే ఉండింది. అయితే, 2023–24 నాటికి ఏపీ వాటా 4.7 శాతంకు పెరగగా, తెలంగాణ వాటా 4.9 శాతానికి పెరగడం గమనార్హం.మరోవైపు జీడీపీలో తెలంగాణ వాటా కూడా అంతకంతకూ పెరుగుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. 2010–11లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 3.8 శాతంగా ఉంటే... 2023–24 నాటికి ఇది 4.9 శాతానికి ఎగబాకింది. 

13 ఏండ్ల వ్యవధిలో ఈ స్థాయిలో పెరుగుదల నమోదు చేసిన అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు నివేదిక వివరించింది. 2014–15లో అప్పటి ధరలను బట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2023–24 నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ. 14.64 లక్షల కోట్లకుచేరింది. పదేండ్ల వ్యవధిలో తెలంగాణ జీఎస్డీపీ రూ. 9.59 లక్షల కోట్ల మేర పెరిగింది. దేశం మొత్తం మీద ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ప్రశంసనీయమైన ప్రగతి గత పదేళ్లలో సాధించినట్లు అన్ని నివేదికలు, ప్రమాణాలు స్పష్టం చేస్తుంటే... 16వ ఆర్థిక సంఘం ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం గగ్గోలు పెట్టడం రాష్ట్రాభివృద్ధిని కించపరచడమే కాగలదు. 

తాజాగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన ఎంఎస్‌ఎంఈ పాలసీ పత్రంలో, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వృద్ధిరేటు ఎంతో మెరుగ్గా ఉందని తెలిపింది. ఎంఎస్‌ఎంఈల సగటు పెట్టుబడి రూ. 2.15 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. తరచూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నినిందించే రాష్ట్ర సర్కారు, పరిశ్రమల అభివృద్ధిలో కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిన విజయాలను ఒప్పుకోక తప్పలేదు. టీజీ–ఐపాస్‌ పోర్టల్‌లో నమోదైన కొత్త ఎంఎస్‌ఎంఈ యూనిట్లను పరిశీలిస్తే, గడిచిన పదేండ్లలో వరుసగా వృద్ధి నమోదయ్యింది. పదేండ్లలో 11.15 శాతంనుంచి 15 శాతం వరకు వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వం వివరించింది. నేడు తెలంగాణలో ఎంఎస్‌ఎంఈల సంఖ్య 26 లక్షలుగా ఉన్నదని వెల్లడించింది. 

సగటు పెట్టుబడులు కూడా 115 శాతం పెరిగినట్లు తెలి పింది. ఎంఎస్‌ఎంఈలో ఉపాధి అవకాశాలు 20 శాతం పెరిగినట్టు, ఎస్సీ, ఎస్టీలు 30 శాతం ఎంఎస్‌ఎంఈల్లో ఉపాధి పొందినట్టు స్పష్టం చేసింది. కోవిడ్‌ కారణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడినా తెలంగాణలో మాత్రం అటువంటి పరిశ్రమల సంఖ్య నామమాత్రంగా ఉండడం విశేషం. తెలంగాణ, పదేండ్లలో పారిశ్రా మిక రంగంలో ఇతర రాష్ట్రాల కన్నా వేగంగా వృద్ధి సాధించినట్టు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ ప్రకటనే స్పష్టం చేస్తోంది. 

పరిశ్రమల కోసం జరిపే భూముల కొనుగోలులో స్టాంప్‌ డ్యూటీ మినహాయింపును యథావిధిగా కొనసాగించడంతో పాటు టీ–ప్రైడ్, టీ–ఐడియా పథ కాల రాయితీలను స్వల్పంగా పెంచారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన టీఎస్‌ ఐపాస్‌ వంటి సింగిల్‌ విండో విధానం, స్నేహపూర్వక పారిశ్రామిక పంథా, నిరంతర విద్యుత్తు సరఫరా తదితరమైన పలు కారణాలతో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో ప్రముఖంగా ఎదిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.

మరోవంక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందంటూ విషప్రచారం చేసిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో అడ్డగోలుగా అప్పులు చేస్తున్నది. నిరుడు డిసెంబర్‌ 7న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 285 రోజుల్లో రూ. 71,495 కోట్లు అప్పు చేసింది. అంటే ప్రతి రోజూ రాష్ట్ర ప్రజలపై రూ. 250 కోట్ల అప్పుల భారం మోపుతోంది. ఆగస్టు 13వ తేదీ వరకే, ఒక్క ఆర్బీఐ నుంచి రూ.42,118 కోట్ల రుణం సేకరించింది. వివిధ కార్పొరేషన్లకు రూ. 24,877 కోట్ల అప్పులకు గ్యారంటీలు ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రంలోని నాలుగు కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరిపై గత తొమ్మిది నెలల్లోనే రూ. 17,873 భారం మోపింది. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఏడాది రూ. 52,576 కోట్ల రుణం సమీకరించనున్నట్టు 2023–24 బడ్జెట్లో ప్రతిపా దించింది. ఈ ఏడాది అప్పుల లక్ష్యాన్ని రూ. 62,012 కోట్లకుపెంచింది. ఇందులో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ. 57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ. 1000 కోట్లు సమీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి లెక్కించినా... ఆగస్టు 13వ తేదీ నాటికి బహిరంగ మార్కెట్‌ నుంచి రూ. 27 వేల కోట్ల రుణాలు సమీకరించింది. అంటే ఏడాది లక్ష్యంలో దాదాపు సగాన్ని కేవలం నాలుగున్నర నెలల్లోనే చేరుకుంది. 

గ్యారెంటీలు కూడా కలుపుకుంటే ఈ ఏడాది లక్ష్యాన్ని ఇప్పటికే దాటిపోయింది. గత ప్రభుత్వం సాధించిన అసాధారణ ఆర్థిక ప్రగతిని గుర్తించ లేని, గుర్తించినా అంగీకరించలేని, అంగీకరించినా... కావాలని తప్పుడు ప్రచారాలు చేసే కాంగ్రెస్‌వారా నీతులు వల్లించేది? ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్‌ జాగ్రత్త!

- వ్యాసకర్త ఎమ్మెల్యే, మాజీ మంత్రి
- టి. హరీశ్‌ రావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement