15వ ఆర్థిక సంఘం సభ్యులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3% మించి రుణాలు స్వీకరించేందుకు ఆర్థికాభివృద్ధి ఉన్న రాష్ట్రాలను అనుమతించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని సీఎం కేసీఆర్ 15వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఇది ఎంతో సహకరిస్తుందన్నారు. జీఎస్‌డీపీపై అదనంగా మరొకశాతం అప్పు పొందేందుకు అవకాశం కల్పించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ బృందంతో.. సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బృందానికి కేసీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు. వివిధ అంశాల్లో రాష్ట్రాలు సాధిస్తున్న పురోగతికి గుర్తింపుగా ప్రోత్సాహకాలను సిఫారసు చేయాలన్నారు. కేంద్ర పథకాలకే పరిమితం చేయకుండా రాష్ట్రాల కీలక పథకాలకు ఈ ప్రోత్సాహకాలను వర్తింపజేయాలన్నారు. రైతుబంధు, మధ్యాహ్న భోజనం, ఉపాధిహామీ వంటి పథకాలను తొలుత రాష్ట్రాలే అమలు చేయగా, కేంద్రం అనుసరించక తప్పలేదని, ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. ప్రాధాన్య, అప్రాధాన్యత అంశాలను కేంద్రం కన్నా రాష్ట్రాలే బాగా గుర్తించగలవన్నారు. పన్నుల క్రమబద్ధీకరణలో భాగంగా రాష్ట్రాలు తమ స్వయంప్రతిపత్తి విషయంలో రాజీపడి జీఎస్టీకి సంపూర్ణ మద్దతునిచ్చాయని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయానికి ఆధారమైన వాణిజ్య పన్ను/వ్యాట్ జీఎస్టీలో అంతర్భాగమైందన్నారు. కేంద్రం ఆదాయ పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీలను జీఎస్టీలో విలీనం చేయలేదన్నారు. 50% పైగా రాష్ట్రాలకు సొంత ఆదాయం తెచ్చే పన్నులు జీఎస్టీ పరిధిలోకి రాగా కేవలం 31% కేంద్ర పన్నులు మాత్రమే ఏకీకృత పన్ను జాబితాలో చేరాయన్నారు. దీంతో రాష్ట్రాలు ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోయాయన్నారు. (రాష్ట్రాభివృద్ధిలో ఐటీ పాత్ర భేష్)
దేశమంతా తెలం‘గానం’
ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్లు నిధుల వ్యయ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయగల పరిపక్వతను రాష్ట్రాలు సాధించాయని, ఈ విషయంలో కేంద్రం కంటే రాష్ట్రాలే ఆర్థిక దూరదృష్టితో వ్యవహరించగలవని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనాల గురించి మాత్రమే చర్చ జరిగేదని, ఇప్పుడే దేశమంతా తెలంగాణ అభివృద్ధి నమూనా గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాలకు సమ భాగస్వామ్యం లభించనుందని నీతి ఆయోగ్ ఏర్పాటుతో ఆశలు చిగురించాయని, కానీ ఈ ఆశలు ఫలించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు అధిక నిధుల కేటాయింపునకు తాము వ్యతిరేకం కామన్నారు. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ కాకుండా ఇతర మార్గాల్లో సహకారం అందించాలన్నారు. రాష్ట్రాలకు పన్నుల ఆదాయం పంపిణీ పెంచాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల వల్ల దేశ అభివృద్ధి ఎజెండా ముందుకు సాగిందని గుర్తు చేశారు.
బకాయిలు ఇవ్వాలి
తెలంగాణ ఏర్పడిన కొత్తలో తీవ్రమైన సంక్షోభం నెలకొని ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. తీవ్ర విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలతోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు దేశ సగటుకు దిగువన ఉండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని, బంగారు తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2002–05, 2005–11 మధ్య కాలంలో రాష్ట్రం పరిధిలోని అంశాలపై కేంద్ర నిధుల వ్యయం 14–20%కు పెరిగిందని, అలాగే ఉమ్మడి జాబితాలోని అంశాలపై 13–17%కు చేరిందని 14వ ఆర్థిక సంఘం నివేదించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపులు పెంచేందుకు పుష్కలమైన అవకాశాలున్న విషయాన్ని ఈ అంశం వెల్లడిస్తోందన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రాలకు రావాల్సిన రోడ్డు సెస్, క్లీన్ ఎనర్జీ సెస్ పూర్తి స్థాయిలో రావడం లేదని, కాగ్ తప్పుబట్టినా కేంద్రం బకాయిలు చెల్లించడం లేదని సీఎం వెల్లడించారు. 2017–18 చివరినాటికి కేంద్ర రాష్ట్రాలకు రూ.72,726 కోట్ల రోడ్ సెస్, రూ.44,505 కోట్ల క్లీన్ ఎనర్జీ సెస్‌ను బకాయి పడిందన్నారు.
ప్రాధామ్యాలు నిర్ణయించే హక్కు రాష్ట్రాలకే
రాష్ట్రాల్లోని పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రాధామ్యాలు నిర్ణయించుకునేందుకు అవకాశాలు కల్పిస్తే బావుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల్లోనూ లెక్కకు మించి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉండడాన్ని ఆయన ఉదహరించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన సర్కారియా కమిషన్ చర్చల సందర్భంగా కూడా ఉమ్మడి జాబితా రద్దు చేయాలని రాష్ట్రాలు ప్రతిపాదించాయని గుర్తు చేశారు. కేంద్ర–రాష్ట్ర ఉమ్మడి జాబితాలో చేర్చిన క్రిమినల్‌లా, అటవీ, దివాళా, కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమం, లీగల్, మెడికల్, విద్య, విద్యుత్ వంటి అంశాలపై ఎక్కువగా పార్లమెంటే చట్టాలు చేస్తోందన్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం కొత్త పథకాలు అమలు చేస్తోందని, రాష్ట్రాల్లో అంతకంటే మంచి పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నదీజలాల హక్కుల నిర్ధారణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరి ఏళ్లు గడుస్తున్నా.. ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌కు నివేదించలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయొచ్చునని మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా తమ ప్రభుత్వం చేసి చూపించిందని కేసీఆర్ అన్నారు. రాబోయే ఐదారేళ్లలో దేశంలోని ప్రతీ గ్రామానికి నీటిసరఫరా చేసే లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రూ.8–10లక్షల కోట్ల వ్యయం కావొచ్చన్నారు.
ప్రతీఏడాది ఎమ్మెస్పీ పెంచాలి
కనీస మద్దతు ధరను రూ.500 లేదా ప్రస్తుతమున్న ఎమ్మెస్పీకి మూడోవంతు పెంచడమో చేయాలని కేసీఆర్ సూచించారు. ఉద్యోగుల డీఏలో మాదిరిగా ధరల సూచీకి లింక్ చేయడం ద్వారా ఎమ్మెస్పీని ప్రతీఏడాది పెంచాలని కోరారు. వ్యవసాయరంగంలో లాభాలు, ఉత్పాదకత తక్కువగా ఉన్నందున రైతులు–వినియోగదారుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10వేలు రైతులకు చెల్లించడం అనేది ఈ దిశగా ఒక ముందడుగు అని చెప్పారు. నీటిరంగంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న పలు విభేదాలను సంప్రదింపులతో అధిగమించగలిగామని, కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు ఒక సజీవసాక్ష్యమని కేసీఆర్ చెప్పారు.
సీఎం పేర్కొన్న మరిన్ని అంశాలు
– కేంద్రపన్నులో రాష్ట్రాల వాటా పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు. జీఎస్టీ విధానం అమలు వల్ల రాష్ట్రాల సొంత ఆదాయాల్లో కోత పడిందన్నారు. అందువల్ల జీఎస్టీలో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని కోరారు.
– ఎఫ్‌ఆర్‌బీఎంను ఇప్పుడు ఉన్నదానికంటే 1% పెంచాలని, సమానత్వం, సమర్థత విషయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యయానికి బదులు రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలు ఇవ్వాలని కోరారు.
– రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 8,368 నుంచి 12,751కు, పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 74 నుంచి 142కు పెంచామని, వాటి అవరాలకు తగ్గట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని కోరారు.
– రాష్ట్రంలోని 1.24కోట్ల ఎకరాలకు నీటిపారుదల సదుపాయం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని పలు ప్రాజెక్టులు చేపట్టాం. రూ.80 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో 13 జిల్లాల పరిధిలో 18లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం. 15వ ఆర్థికసంఘం కాల పరిమితిలో ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.40,169 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యయాన్ని సిఫారసు చేయాలి.
– ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకం నిర్వహణ కోసం 2020–25 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలకు రూ.10,142 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.2,850 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.12,722 కోట్ల నిర్వహణ వ్యయాన్ని సైతం 15వ ఆర్థిక సంఘం కింద సిఫారసు చేయాలి. ఈ పథకం కింద వినియోగదారులపై యూజర్ చార్జీలు విధించాలని అనుకుంటున్నాం. కానీ కొంత సమయం పడుతుంది. ఈ విషయంలో కమిషన్ సహకారం అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment