
పన్నుల వాటా నుంచి ఏపీకి 4.3%
సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఆర్థిక ప్రయోజనం కలుగనుంది. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42% ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1.69,970 లక్షల కోట్లు రానున్నాయి. అంతేగాక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు రెవెన్యూ లోటు భర్తీ రూపంలో రూ.22,113 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందించనుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు మొత్తం 11 రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2016, ఏప్రిల్ నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)ను అమల్లోకి తేనున్న నేపథ్యంలో కేంద్రానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది.
ఆ మేరకు ఐదేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.39,48,187 కోట్ల ఆదాయం వస్తుందని, ఇందులో 42 శాతాన్ని రాష్ట్రాలకు బదలాయించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా నుంచి 4.3% రానుంది. అలాగే సర్వీసు పన్నుల నుంచి 4.3% ఆదాయం రానుంది. గత ఆర్థిక సంఘాల మాదిరిగా 14వ ఆర్థిక సంఘం రంగాల వారీగా గ్రాంట్లను సిఫార్సు చేయలేదు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు, విపత్తుల నివారణకు మాత్రమే గ్రాంట్లను సిఫార్సు చేసింది. విద్య, వైద్య ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి ఇతర మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాలని పేర్కొంది. జాతీయ ఉపాధి హామీ పథకం తప్ప మిగతా కేంద్ర ప్రాయోజిత పథకాలను ఇక కేంద్రం అమలు చేయకుండా ఆ నిధులను రాష్ట్రాలకే ఇవ్వడంలో భాగంగానే పన్నుల్లో 42% వాటాను ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఇక ప్రణాళిక గ్రాంట్లు ఉండబోవని దీన్ని బట్టి అర్థమవుతోందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మొత్తమ్మీద ఉమ్మడి రాష్ట్రంలో 13 ఆర్థిక సంఘం సిఫార్సులు చేసినప్పటికీ... విభజన తర్వాత ఏపీకి విడిగా చూస్తే కేంద్ర పన్నుల వాటాలో ఆ సమయంలో 4.1% రాగా, ఇప్పుడు 4.3% వాటా వస్తోందని ఆ అధికారి వివరించారు. విభజనను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఆదాయ, వ్యయాలను అంచనా వేసినట్లు సంఘం సిఫార్సుల్లో పేర్కొంది. ఈ నిధుల విడుదలకు కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వచ్చే ఐదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలకు రూ.3,631 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.8,650 కోట్లు గ్రాంటుగా సిఫార్సు చేసింది. అలాగే విపత్తుల నిర్వహణ కింద ఐదేళ్ల కాలానికి రూ.2,429 కోట్లను మంజూరు చేసింది. గతంలో ఈ మొత్తంలో 25% రాష్ట్ర ప్రభుత్వం 75% కేంద్రం భరించేది. ఇప్పుడు రాష్ట్రం 10% మిగతా 90% కేంద్రం భరించనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.25% అప్పులు తెచ్చుకోవడానికి అనుమతించింది. 14వ ఆర్థిక సంఘం సమయంలో 3% కన్నా తక్కువ అప్పులు చేస్తే ఆ మరుసటి సంవత్సరంలో ఆ తక్కువ చేసిన మొత్తాన్ని తెచ్చుకునే వెసులు బాటును కల్పించారు.