tax share
-
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా.. ఆరేళ్ళలో ఏపీకి రూ.లక్షా 88 వేల కోట్లు..
న్యూఢిల్లీ, మార్చి 28: జీఎస్టీతో సహా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల మొత్తంలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద గత 6 సంవత్సరాల్లో (2017 నుంచి 2023 మార్చి 10 వరకు) రూ.1,88,053.83 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వాటా కింద విడుదల చేస్తున్న పన్నుల ఆదాయం గత 5 ఏళ్ళుగా తగ్గుతూ వస్తోందా? అంటూ రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర వసూలు చేసిన పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 2017-18లో రూ.29,001.25 కోట్లు, 2018-19లో రూ.32,787.03 కోట్లు, 2019-20లో రూ.28,242.39 కోట్లు, 2020-21లో రూ.24,460.59 కోట్లు, 2021-22 లో రూ.35,385.83 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి రూ.38,176.74 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే దేశంలోని 29 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల వాటా కింద గడిచిన ఆరేళ్ళలో రూ.45,11,442.86 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 2017-18లో రూ.6,73,005.29 కోట్లు, 2018-19లోరూ.7,61,454.15 కోట్లు, 2019-20లో రూ.6,50,677.05 కోట్లు, 2020-21లో రూ.5,94,996.76 కోట్లు, 2021-22 లో రూ.8,82,903.79 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి రూ.9,48,405.82 కోట్లు ఆయా రాష్ట్రాల వాటా కింద విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం పన్నుల ద్వారా వసూలు చేసిన నికర ఆదాయంలో రాష్ట్రాల వాటా కింద నెలవారీ ప్రాతిపదికన పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నికర ఆదాయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 279 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా నిర్ధారించి, ధృవీకరిస్తారని కూడా మంత్రి పేర్కొన్నారు. చదవండి: బాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయంపై విచారణ జరపాలి -
పన్నుల వాటాలో ‘మొండిచేయే’!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రావడం లేదు. ఈ ఏడాది కేంద్ర పన్నుల వాటా కింద రూ. 14,348 కోట్లు వస్తాయనే అంచనాలో రాష్ట్ర ప్రభుత్వం ఉండగా అందులో జనవరి ముగిసే నాటికి 66 శాతమే వచ్చాయి. వాస్తవానికి 2019–20 బడ్జెట్లో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను దాదాపు 18 శాతంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం రూ. 14,348 కోట్లు వస్తాయనే అంచనా ఉండగా చివరి త్రైమాసికం ప్రారంభమయ్యే జనవరి ప్రారంభానికి రూ. 8,449.85 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఇక చివరి త్రైమాసికంలో మిగిలిన రూ. 6 వేల కోట్లకుపైగా నిధులు రావాల్సి ఉంది. అంటే కనీసం నెలకు రూ. 2 వేల కోట్లయినా పన్నుల వాటా కింద రావాలి. కానీ జనవరిలో కేంద్ర పన్నుల వాటాలో కేవలం రూ. వెయ్యి కోట్లే మంజూరు చేసింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి ఇంకో రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈ రెండు నెలల్లో కేంద్రం నుంచి ఆ స్థాయిలో నిధులు రావడం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
కేంద్ర పన్నుల కేటాయింపుల్లో కోత!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మదింపునకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్దేశించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఏపీతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంచారు. దీని నుంచి ఏపీకి ఏటా 4.305 శాతం మేర పంచుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు అది 4.11 శాతానికి తగ్గిపోయింది. ఇదేకాక.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను సైతం 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించారు. ఏడో ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వాటాలను నిర్దేశించి కేంద్రం పన్నులను పంచింది. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా పన్నుల వాటాను కేటాయిస్తోంది. మరోవైపు.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధం కానందున కేవలం 2020–21కు వర్తించేలా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీని ఆధారంగానే 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటాలను నిర్దేశిస్తూ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో బడ్జెట్లో పొందుపరిచారు. ఒకవేళ పదిహేనో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను 41 శాతం నుంచి ఇంకా తగ్గిస్తే అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు నిధుల లేమిని ఎదుర్కోవలసి వస్తుంది. జనాభాను పటిష్టంగా నియంత్రించిన ఫలితం.. కాగా, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పన్నుల వాటాలు తేల్చేందుకు జనాభాకు 15 శాతం వెయిటేజీ ఇచ్చారు. జనాభా వృద్ధి రేటు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాలు పకడ్బందీగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించాయి. కానీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేకపోయాయి. దీని ఫలితంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. 2020–21కి కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా (అంచనాలు) ఇలా.. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.305 శాతం నుంచి 4.11కి తగ్గింది. కొత్త వాటా ప్రకారం కేంద్ర పన్నుల వాటా నుంచి ఏపీకి రూ.32,237.68 కోట్లు రానున్నట్లు కేంద్ర బడ్జెట్లో అంచనా వేశారు. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ. 9,916.22 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,220.31 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.9,757.50 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2,012.13 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1,314.66 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.17.19 కోట్లుగా ఉంది. అయితే, గడిచిన రెండు మూడేళ్ల కాలంలో బడ్జెట్లో పొందుపరిచిన అంచనాల మేరకు నిధులు రాలేదు. పొందుపరిచిన అంచనాల కంటే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు తక్కువే వచ్చాయి. ఏపీకి రూ.1,521 కోట్ల నష్టం కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.305 శాతం నుంచి 4.11కి తగ్గడంవల్ల 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,521 కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతుంది. 4.305 శాతం వాటా ఉంటే రూ.33,758.98 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పుడు రూ.32,237.68 కోట్లు మాత్రమే రానుంది. -
తెలంగాణకు రూ.450 కోట్ల కోత
పన్నుల వాటాకు గండి కొట్టిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో దాదాపు రూ.450 కోట్లు కోత పడింది. ఈ నెల ఒకటో తేదీన విడుదల కావాల్సిన పన్నుల వాటాలో ఆ మేరకు గండి పడింది. ఇప్పటికే పథకాలకు నిధులను సర్దుబాటు చేసేందుకు తిప్పలు పడుతున్న సమయంలో పన్నుల వాటా కుదించటం తెలంగాణ ఆర్థిక శాఖను మరింత ఇరకాటంలో పడేసింది. రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్నుల వాటాను కేంద్రం దామాషా ప్రకారం ప్రతి నెలా ఒకటో తారీఖున విడుదల చేస్తుంది. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42% నిధులను పంపిణీ చేస్తుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రతినెలా దాదా పు రూ.1000 కోట్లు వాటా కింద విడుదలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.6000 కోట్లు పన్నుల వాటా రూపంలో రాష్ట్ర ఖజానాకు జమయ్యాయి. ఇదే వరుసలో ఈ నెల కోటాలో విడుదల కావాల్సిన రూ.1000 కోట్లకు బదులు, కేంద్రం కేవలం రూ.550 కోట్లు విడుదల చేసింది. ఆశించిన అంచనాల మేరకు పన్నుల రాబడి లేనందునే ఈ నిధులకు కోత పడింది. ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలు ముందస్తు అంచనా ప్రకారం పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం.. వాస్తవ పన్నుల రాబడిని లెక్కగట్టి ఈ నెలలో నిధులకు కత్తెర వేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారిగా 45 శాతం నిధులు కోత పడటంతో రాష్ట్ర ఆర్థిక శాఖ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. రూ.2020 కోట్ల రైతు రుణమాఫీతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను ఈ నెలలోనే చెల్లించాలని సంకల్పించిన నేపథ్యంలో కేంద్రం నిధులు తగ్గిపోవటం ప్రభుత్వానికి అశనిపాతంగా మారింది.