తెలంగాణకు రూ.450 కోట్ల కోత
పన్నుల వాటాకు గండి కొట్టిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో దాదాపు రూ.450 కోట్లు కోత పడింది. ఈ నెల ఒకటో తేదీన విడుదల కావాల్సిన పన్నుల వాటాలో ఆ మేరకు గండి పడింది. ఇప్పటికే పథకాలకు నిధులను సర్దుబాటు చేసేందుకు తిప్పలు పడుతున్న సమయంలో పన్నుల వాటా కుదించటం తెలంగాణ ఆర్థిక శాఖను మరింత ఇరకాటంలో పడేసింది.
రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్నుల వాటాను కేంద్రం దామాషా ప్రకారం ప్రతి నెలా ఒకటో తారీఖున విడుదల చేస్తుంది. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42% నిధులను పంపిణీ చేస్తుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రతినెలా దాదా పు రూ.1000 కోట్లు వాటా కింద విడుదలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.6000 కోట్లు పన్నుల వాటా రూపంలో రాష్ట్ర ఖజానాకు జమయ్యాయి. ఇదే వరుసలో ఈ నెల కోటాలో విడుదల కావాల్సిన రూ.1000 కోట్లకు బదులు, కేంద్రం కేవలం రూ.550 కోట్లు విడుదల చేసింది. ఆశించిన అంచనాల మేరకు పన్నుల రాబడి లేనందునే ఈ నిధులకు కోత పడింది.
ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలు ముందస్తు అంచనా ప్రకారం పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం.. వాస్తవ పన్నుల రాబడిని లెక్కగట్టి ఈ నెలలో నిధులకు కత్తెర వేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారిగా 45 శాతం నిధులు కోత పడటంతో రాష్ట్ర ఆర్థిక శాఖ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. రూ.2020 కోట్ల రైతు రుణమాఫీతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను ఈ నెలలోనే చెల్లించాలని సంకల్పించిన నేపథ్యంలో కేంద్రం నిధులు తగ్గిపోవటం ప్రభుత్వానికి అశనిపాతంగా మారింది.