స్వాంతంత్రోద్యమంలో జిల్లా పాత్ర ఘనం
స్వాంతంత్రోద్యమంలో జిల్లా పాత్ర ఘనం
Published Mon, Aug 15 2016 8:48 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
గుంటూరు ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ కన్నెగంటు రక్త తర్పణంతో పల్నాడులో జరిగిన పుల్లరి పోరాటం, సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో జరిగిన ఆందోళనలు, క్విట్ ఇండియా ఉద్యమకాలంలో తెనాలి ప్రజలు చేసిన త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు నడిచిన బాటలో జిల్లా సమగ్రాభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచారాల ద్వారా రెండంకెల వృద్ధి సాధించేందుకు కార్యోన్ముఖులు కావాలని అన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రూ. 55,871 కోట్ల స్థూల ఆదాయాన్ని సమకూర్చి, రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని చెప్పారు. తలసరి ఆదాయం 1,09,556 రూపాయలతో 5వ స్థానంలో నిలిచి 11.39 శాతం వృద్ధి రేటు సాధించిందని వివరించారు.
వ్యవసాయ రంగానికి పెద్ద పీట..
వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసి 8,700 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం రాయితీపై అందించామని చెప్పారు. వివిధ యంత్ర పరికరాలను రైతులకు సబ్సిడీపై జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. వేట నిషేధ సమయంలో 5,200 మంది మత్స్యకారుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ. నాలుగు వేలు చొప్పున 2.08 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేశామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలోని 63 వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2.52 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, మాజీ ఎంపీ యలమచిలి శివాజీ, జేసీ ఎం.వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. నాగలక్ష్మి, డీఆర్వో కె. నాగబాబు, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement