Minister Prathipati
-
అగ్రిగోల్డ్ డైరెక్టర్ దగ్గర భూమి కొన్నది నిజమే
మరో ఇద్దరి దగ్గరా కొనుగోలు చేశాం: మంత్రి ప్రత్తిపాటి వెల్లడి సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న ఉదయ్ దినకరన్ దగ్గర తన భార్య వెంకాయమ్మ భూమి కొనడం నిజమేనని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంగీకరించారు. అతని వద్ద నుంచి 6.17 ఎకరాల భూమిని కొన్నామన్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. 2014 జనవరి 31వ తేదీన ఈ భూమిని తమ కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. దినకరన్ తన సొంత సొమ్ముతో ఆదాయపు పన్ను రిటర్న్స్ చూపించి ఈ భూమిని కొనుగోలు చేశాడని, అతని నుంచి ఎకరం 4 లక్షల చొప్పున తాము కొనుగోలు చేశామని చెప్పారు. అతను అగ్రిగోల్డ్ కంపెనీ షేర్‌హోల్డర్ కాదు కాబట్టి అది అగ్రిగోల్డ్ భూమి కాదన్నారు. ప్రగడ విజయ్‌కుమార్, బండా సాంబశివరావు నుంచి కూడా తాము భూములు కొనుగోలు చేశామని, ముగ్గురి నుంచి మొత్తం 14 ఎకరాలు కొన్నది నిజమేనని తెలిపారు. తన కంపెనీ వాళ్లు అన్నీ చూసుకుని వివాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే తన భార్య పేర ఆ భూములను రిజిస్టర్ చేయించారని, వాస్తవానికి ఈ విషయం తనకూ తెలియదని చెప్పారు. హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయాలని ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసిందని, కానీ కోర్టు మొదటి జాబితాలో దాన్ని వేలం వేయించలేదని తెలిపారు. అగ్రిగోల్డ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ వ్యాఖ్యలను ప్రదర్శించడం సభను పక్కదారి పట్టించడం కాదా అని ప్రశ్నించగా.. కావాలనే అలా చేయాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్షం అన్నింటినీ వివాదం చేయాలని చూడడంతో స్పీకర్ తాను చేసిన వ్యాఖ్యలను కూడా చూపాల్సి వచ్చిందని చెప్పారు. -
ప్రత్తిపాటి కుయుక్తులను అడ్డుకుంటాం
* దళితుల భూముల్లో ఒక్క సెంటు తీసుకున్నా తీవ్ర పరిణామాలు * వైఎస్సార్సీపీ నాయకుల హెచ్చరిక * యడవల్లి భూముల పరిశీలన * అండగా ఉంటామని దళితరైతులకు భరోసా చిలకలూరిపేట: యడవల్లి దళిత రైతుల భూములను కబ్జా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న కుయుక్తులను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు చెప్పారు. చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని దళితులకు చెందిన 416 ఎకరాల పంట భూములను పార్టీ ఎస్సీ విభాగంతో పాటు వివిధ విభాగాల నాయకులు మంగళవారం సందర్శించారు. దళిత రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ... అధికారం చేపట్టిన నాటి నుంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న మంత్రి దళితుల భూములపై కన్నేశారని, వారిని భూముల నుంచి వెళ్లగొట్టేందుకు అధికారులతో తప్పుడు నివేదికలు రూపొందించారని ఆరోపించారు. మంత్రి ప్రాపకం కోసం తప్పుడు నివేదికలు రూపొందించిన తహసీల్దార్‌తో పాటు ఇతర అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ నిక్షేపాలు కాజేసేందుకే... ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే పెదమాదిగనై రుణం తీర్చుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తే, ఆయన మంత్రి వర్గంలోని ప్రత్తిపాటి పుల్లారావు దళితుల భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలే దేవరాజు విమర్శించారు. భూముల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్ నిక్షేపాలు కాజేసేందుకు పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసి వారిని రోడ్డు పాలు చేసేందుకు మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 416 ఎకరాల భూమిలో ఒక్క సెంటు తీసుకున్నా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రజాఉద్యమం ద్వారా తేల్చుకుంటాం.. దళితుల భూములు కాజేసేందుకు భూబకాసురుడి అవతారం ఎత్తిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంగతి ప్రజా ఉద్యమం ద్వారా తేల్చుకుంటామని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తోట జోసెఫ్ హెచ్చరించారు. వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమిస్తామని, దళితులకు అన్యాయం జరగకుండా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ భూకుంభకోణం వ్యవహారంలో సీబీఐ విచారణ నిర్వహించి మంత్రితో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలుచేపట్టాలని కోరారు. అనంతరం దళితుల భూములకు నీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు), మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మాబు, సేవాదళ్ జిల్లా అ«ధ్యక్షుడు కొత్త చిన్నపరెడ్డి, గుంటూరురూరల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏటుకూరి విజయసారధి, ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంగా జయరాజు, పార్టీ జిల్లా కార్యదర్శి చిలకా సుబ్బారావు, బండారు శ్రీనివాసరావు, కాకుమాను జయప్రకాశ్, పచ్చల ఆనందరావు, చిలకలూరిపేట మండల పార్టీ అధ్యక్షుడు చాపలమడుగు గోవర్దన్, యువజన విభాగం అధ్యక్షుడు వేజర్ల కోటేశ్వరరావు, యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ ఉపా«ధ్యక్షుడు తాళ్లూరి వెంకట్రావు , నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు రాయిపూడి మాణిక్యరావు, మాదిగ సంక్షేమ పోరాట సభ రాష్ట్ర అధ్యక్షుడు తంగిరాల ఇర్మియా మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్తిపాటిది పలాయనవాదం
* మంత్రి ముందుగా ప్రకటించిన విధంగా * అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి * వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టౌన్: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుది పలాయనవాదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నిజాయితీ నిరూపించుకొనేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి తీరా తాము అవినీతిని ఆధారాలతో నిరూపిస్తామని ప్రకటించాక, మంత్రి చర్చకు రారని అనుచరులతో ప్రకటన చేయించడం ఇందుకుS నిదర్శనమన్నారు. మంత్రి, ఆయన సతీమణి ఎక్కడెక్కడ, ఎవరి వద్ద నుంచి ఎంత వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నదీ నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక సిటీకేబుల్ నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన వారి వాటాలను లాక్కుని నెలనెలా లక్షల రూపాయలు ఆదాయం తీసుకుంటున్నది నిజం కాదా.. అని ప్రశ్నించారు. సిటీ కేబుల్‌ను పూర్తిగా స్వాధీనపరుచుకొని తన అనుచరులతో ప్రచారం చేయించడం పేట ప్రజలందరికీ తెలుసన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షమైన వెఎస్సార్ సీపీకి సంబంధించి ఒక్క వార్తను ప్రసారం చేయకపోవడమే ఈ చానల్లో మంత్రి పాత్ర ఏమిటో స్పష్టమవుతుందని తెలిపారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో రైతుల పేరున మంత్రి కంపెనీలో పనిచేసే వారి పేరున చెక్కులు తీసుకొన్న వ్యవహారాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అగ్రిగోల్డ్ భూములను మంత్రి భార్యపేరున కొనుగోళ్లు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యడవల్లి ఎస్సీ భూములలో మైనింగ్ తవ్వకాలు నిర్వహించేందుకు తన కంపెనీలో పనిచేసేవారితో దరఖాస్తు చేయించిన వ్యవహారాన్ని నిరూపిస్తామన్నారు. మంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరారు -
స్వాంతంత్రోద్యమంలో జిల్లా పాత్ర ఘనం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం గుంటూరు ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ కన్నెగంటు రక్త తర్పణంతో పల్నాడులో జరిగిన పుల్లరి పోరాటం, సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో జరిగిన ఆందోళనలు, క్విట్ ఇండియా ఉద్యమకాలంలో తెనాలి ప్రజలు చేసిన త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు నడిచిన బాటలో జిల్లా సమగ్రాభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచారాల ద్వారా రెండంకెల వృద్ధి సాధించేందుకు కార్యోన్ముఖులు కావాలని అన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రూ. 55,871 కోట్ల స్థూల ఆదాయాన్ని సమకూర్చి, రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని చెప్పారు. తలసరి ఆదాయం 1,09,556 రూపాయలతో 5వ స్థానంలో నిలిచి 11.39 శాతం వృద్ధి రేటు సాధించిందని వివరించారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట.. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసి 8,700 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం రాయితీపై అందించామని చెప్పారు. వివిధ యంత్ర పరికరాలను రైతులకు సబ్సిడీపై జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. వేట నిషేధ సమయంలో 5,200 మంది మత్స్యకారుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ. నాలుగు వేలు చొప్పున 2.08 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేశామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలోని 63 వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2.52 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, మాజీ ఎంపీ యలమచిలి శివాజీ, జేసీ ఎం.వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. నాగలక్ష్మి, డీఆర్వో కె. నాగబాబు, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మరో 11 రైతు బజార్లు: మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు : రాష్ట్రంలో మరో 11 రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. రైతు బజార్లలో ధరల సూచికలతో కూడిన ఎలక్ట్రానిక్ డిస్ప్లేను ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మార్కెట్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మార్కెటింగ్ ఆదాయం నుంచి 20 శాతం నిధులు, 20 శాతం మ్యాచింగు గ్రాంటుతో లింక్ రోడ్లు వేయాలని నిర్ణయించామని చెప్పారు. దీనికి సంబంధించి జూలై 30 కల్లా అన్ని జిల్లాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 22న రైతు ఉపశమన అర్హత పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. రూ.3,512 కోట్లను 32.9 లక్షల రైతుల ఖాతాలకు జమచేయనున్నట్టు చెప్పారు. -
'ప్రలోభాల కారణంగానే పార్టీలు మారుతున్నారు'
- ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపుపై మంత్రి ప్రత్తిపాటి - సీఎం చంద్రబాబు పడుతున్న కష్టం చూసి అంటూ మాట మార్పు మంగళగిరి (గుంటూరు జిల్లా) : ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళుతున్నారో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. తెలంగాణలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రలోభాల కారణంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళుతున్నారని, ఇక్కడ కూడా అంతేనని ఆయన వెల్లడించారు. నిజం బయటకు వచ్చేయడంతో తర్వాత నాలుక్కరుచుకుని ఇక్కడ రాష్ట్రాభివృద్ధికి తమ ముఖ్యమంత్రి 66 ఏళ్ల వయసులో పడుతున్న కష్టాన్ని చూసి.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారంటూ మాట మార్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం ఓ క్లినిక్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ప్రలోభాల కారణంగానే ఎక్కడైనా ఎమ్మెల్యేలు పార్టీలు మారతారని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై గవర్నర్‌తో పాటు ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండదన్నారు. జూన్ చివరికి తాత్కాలిక సచివాలయం పూర్తి.. రాజధానిలో గ్రామ కంఠాలతో సహా అన్ని సమస్యలను మే నెలాఖరుకి పరిష్కరించి, రైతులకు ప్లాట్లు అందిస్తామని మంత్రి తెలిపారు. జూన్ చివరినాటికి తాత్కాలిక సచివాలయం పూర్తి చేస్తామని, రానున్న అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదనరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
'రాయితీపై రైతులకు ఆవులు'
తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు రాయితీపై ఆవులను అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పలాల వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు.