అగ్రిగోల్డ్ డైరెక్టర్ దగ్గర భూమి కొన్నది నిజమే
మరో ఇద్దరి దగ్గరా కొనుగోలు చేశాం: మంత్రి ప్రత్తిపాటి వెల్లడి
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న ఉదయ్ దినకరన్ దగ్గర తన భార్య వెంకాయమ్మ భూమి కొనడం నిజమేనని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంగీకరించారు. అతని వద్ద నుంచి 6.17 ఎకరాల భూమిని కొన్నామన్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. 2014 జనవరి 31వ తేదీన ఈ భూమిని తమ కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. దినకరన్ తన సొంత సొమ్ముతో ఆదాయపు పన్ను రిటర్న్స్ చూపించి ఈ భూమిని కొనుగోలు చేశాడని, అతని నుంచి ఎకరం 4 లక్షల చొప్పున తాము కొనుగోలు చేశామని చెప్పారు.
అతను అగ్రిగోల్డ్ కంపెనీ షేర్‌హోల్డర్ కాదు కాబట్టి అది అగ్రిగోల్డ్ భూమి కాదన్నారు. ప్రగడ విజయ్‌కుమార్, బండా సాంబశివరావు నుంచి కూడా తాము భూములు కొనుగోలు చేశామని, ముగ్గురి నుంచి మొత్తం 14 ఎకరాలు కొన్నది నిజమేనని తెలిపారు. తన కంపెనీ వాళ్లు అన్నీ చూసుకుని వివాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే తన భార్య పేర ఆ భూములను రిజిస్టర్ చేయించారని, వాస్తవానికి ఈ విషయం తనకూ తెలియదని చెప్పారు.
హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయాలని ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసిందని, కానీ కోర్టు మొదటి జాబితాలో దాన్ని వేలం వేయించలేదని తెలిపారు. అగ్రిగోల్డ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ వ్యాఖ్యలను ప్రదర్శించడం సభను పక్కదారి పట్టించడం కాదా అని ప్రశ్నించగా.. కావాలనే అలా చేయాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్షం అన్నింటినీ వివాదం చేయాలని చూడడంతో స్పీకర్ తాను చేసిన వ్యాఖ్యలను కూడా చూపాల్సి వచ్చిందని చెప్పారు.