ప్రత్తిపాటిది పలాయనవాదం
ప్రత్తిపాటిది పలాయనవాదం
Published Wed, Nov 2 2016 5:43 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
* మంత్రి ముందుగా ప్రకటించిన విధంగా
* అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి
* వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట టౌన్: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుది పలాయనవాదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నిజాయితీ నిరూపించుకొనేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి తీరా తాము అవినీతిని ఆధారాలతో నిరూపిస్తామని ప్రకటించాక, మంత్రి చర్చకు రారని అనుచరులతో ప్రకటన చేయించడం ఇందుకుS నిదర్శనమన్నారు. మంత్రి, ఆయన సతీమణి ఎక్కడెక్కడ, ఎవరి వద్ద నుంచి ఎంత వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నదీ నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక సిటీకేబుల్ నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన వారి వాటాలను లాక్కుని నెలనెలా లక్షల రూపాయలు ఆదాయం తీసుకుంటున్నది నిజం కాదా.. అని ప్రశ్నించారు.
సిటీ కేబుల్‌ను పూర్తిగా స్వాధీనపరుచుకొని తన అనుచరులతో ప్రచారం చేయించడం పేట ప్రజలందరికీ తెలుసన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షమైన వెఎస్సార్ సీపీకి సంబంధించి ఒక్క వార్తను ప్రసారం చేయకపోవడమే ఈ చానల్‌లో మంత్రి పాత్ర ఏమిటో స్పష్టమవుతుందని తెలిపారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో రైతుల పేరున మంత్రి కంపెనీలో పనిచేసే వారి పేరున చెక్కులు తీసుకొన్న వ్యవహారాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అగ్రిగోల్డ్ భూములను మంత్రి భార్యపేరున కొనుగోళ్లు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యడవల్లి ఎస్సీ భూములలో మైనింగ్ తవ్వకాలు నిర్వహించేందుకు తన కంపెనీలో పనిచేసేవారితో దరఖాస్తు చేయించిన వ్యవహారాన్ని నిరూపిస్తామన్నారు. మంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరారు
Advertisement