ప్రజాస్వామ్యానికి పాతర | YSRCP MLA Buggana Rajendranath Reddy Fires on TDP Govt | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి పాతర

Published Sun, Jul 1 2018 9:01 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

YSRCP MLA Buggana Rajendranath Reddy Fires on TDP Govt - Sakshi

డోన్‌ :  టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారని, డోన్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు, అవినీతి, అక్రమాల మూలంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.  ‘అరాచకాలు అంతం కావాలి.. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి’ అనే నినాదంతో శనివారం డోన్‌ పట్టణంలోని బుగ్గన స్వగృహం నుంచి పాతబస్టాండు వరకు  వేలాది మందితో  ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండులో జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడారు. 

టీడీపీ నాయకుల అక్రమాలు, అన్యాయాలపై నిప్పులు చెరిగారు. కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనల మూలంగా నియోజకవర్గ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోందన్నారు. పట్టణ నడిబొడ్డున రౌడీషీటర్లు కన్నతండ్రిని కిరాతకంగా హతమార్చడం, చిన్న విషయానికే కొందరు డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డిని పొట్టనబెట్టుకోవడం దారుణమన్నారు. ప్రేమపేరుతో నిండు గర్భిణీని హతమార్చిన నిందితునికి అధికార పార్టీ నాయకులు వంతపాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మునిసిపల్‌ టెండర్ల సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసినా పోలీసులు చోద్యం చూశారన్నారు. ప్రజావైద్యశాల వీధిలో ఒక యువకున్ని కత్తులతో పొడిచినా, కేవీఎస్‌ ఆసుపత్రి వద్ద  ఓ వ్యక్తిపై అధికార పార్టీ మద్దతుదారులు అమానుషంగా దాడిచేసినా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీశారు.  

అడుగడుగునా కబ్జాలు 
డోన్‌లోని టైలర్స్‌ కాలనీ, పేరంటాలమ్మ , గంగమ్మ మాన్యం భూములతో పాటు నాయీబ్రాహ్మణులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకులు కబ్జా చేశారని బుగ్గన అన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకొన్న బేస్‌మట్టాలను టీడీపీ వారు నేలమట్టం చేయడం దారుణమన్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు సైతం వారి కబ్జాకోరల్లో చిక్కుకున్నాయన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు సామాన్య, పేద ప్రజలకు అందకుండా పంది కొక్కుల్లా మింగేశారని విమర్శించారు. నీరు–చెట్టు, వాటర్‌షెడ్లు, ఉపాధి హామీ నిధులతో పాటు మరుగుదొడ్ల బిల్లులను సైతం దిగమింగారన్నారు. ఫ్లైఓవర్‌ కింద నిరుపేద వ్యాపారుల పొట్టకొట్టి రూ.36వేలు, రూ.26వేల చొప్పున అక్రమంగా కిరాయి వసూలు చేస్తోంది ఎవరో టీడీపీ నాయకులే చెప్పాలన్నారు. చెరువుల్లోని మట్టిని రైతుల పంట పొలాలకు ఇవ్వకుండా  బయట విక్రయించి లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారని విమర్శించారు.
  
పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయింపు 
డోన్‌ నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ, ఆస్తులకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ బుగ్గన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డోన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మండుటెండలో బైఠాయించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, ఆక్రమణలను అరికట్టి.. ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పించాలని పోలీసు అధికారులను కోరారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ నాయకుల అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

  సీఐ రాజగోపాల్‌ నాయుడు, ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు, నర్సింహులు, శ్రీధర్‌ తదితరులు ఆయనతో చర్చించి.. నూతన డీఎస్పీ ఖాదర్‌బాషతో మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు. ఇందుకు బుగ్గన సమ్మతించి డీఎస్పీతో మాట్లాడారు. అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మల్లెంపల్లె రామచంద్రుడు,  కోట్రికె హరికిషన్, చంద్రశేఖర్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, దినేష్‌ గౌడ్, ఆర్‌ఈ రాజవర్దన్, పోస్ట్రుపసాద్, వెంకోబారావ్, రామచంద్రారెడ్డి, నర్సింహరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటాపురం చిన్నమాదన్న, మద్దిలేటి, రఫీ, బుర్రు శేఖర్, దారా ప్రతాప్‌రెడ్డి, తాడూరు లచ్చప్ప, అనుంపల్లె వెంకటరాముడు, నాగన్న, ఎద్దుపెంట శ్రీను, జయరాముడు, రామలింగడు, తిరుమల్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, దేవేంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, తొర్రెడ్డి, ఓబులాపురం సుధాకర్‌ యాదవ్, శివారెడ్డి, పెద్దనర్సింహులు, సుధాకర్‌ రెడ్డి, హనుమన్న, చిరంజీవి, గంగన్న, లక్ష్మిపల్లె ఓబులేస్, పెద్ద తిమ్మారెడ్డి, నాయుడు, ధనుంజయ, మద్దిలేటి, గోసానిపల్లె మధుసూదన్‌రెడ్డి, కొచ్చెర్వు కృష్ణారెడ్డి, రమణయ్యశెట్టి, చింతలపేట గంగాధర్‌రెడ్డి, మాధవస్వామి, చిన్నమల్కాపురం బద్దల నాగరాజు, సుబ్బరాయుడు, శివయ్య, రామనాయుడు, లక్ష్మన్న, వలిసెల హనుమంతరెడ్డి, కటిక వేణు, ఎద్దుపెంట వెంకటేశ్వర్లు, మహేశ్వరరెడ్డి, ప్యాపిలి మండల నాయకులు బోరెడ్డి శ్రీరామ్‌రెడ్డి, బోరా మల్లికార్జునరెడ్డి, ఊటకొండ గోపాల్‌రెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి, బాబయ్య, శ్రీనివాసరెడ్డి, రంగన్న, బోరెడ్డి రఘు, జలదుర్గం శ్రీను, రసూల్, బాలవెంకటేశ్, సీమ సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement