సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వపు తప్పిదాలు ఉన్నత విద్యాకోర్సులకు శాపంగా పరిణమించాయి. కళాశాలలు ఎలాంటి ప్రమాణాలు పాటించకున్నా ప్రతిఏటా కోర్సులు, సీట్లు పెంచుకోవడానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. దాంతో కాలేజీల్లో ఉన్నత విద్య నాసిరకంగా మారింది. ఉన్నత విద్యలో ప్రమాణాలు దిగజారడానికి టీడీపీ ప్రభుత్వ పెద్దల అవినీతే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాణాలు లేని కళాశాలల్లోవిద్యార్థుల చేరికలు నానాటికీ పడిపోతున్నాయి. కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు మినహా మిగిలిన కాలేజీల్లో చేరికలు పెద్దగా లేవు. తాజాగా ఎంసెట్, ఐసెట్ ప్రవేశాల గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. కన్వీనర్ కోటాలోని సీట్లలో దాదాపు సగం వరకు ఖాళీగా ఉండిపోతుండగా, భర్తీ అవుతున్న సీట్లు కొన్ని కాలేజీలకే పరిమితం కావడం గమనార్హం.
ఫిర్యాదులు అందినా చర్యలు శూన్యం
గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ, ఫార్మా కాలేజీలపై లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి. బోధకులు లేకుండానే కాలేజీలు నడిపిస్తున్నారని, కొన్ని కాలేజీల్లో కనీసం తరగతులు కూడా నిర్వహించడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై టీడీపీ ప్రభుత్వం దాదాపు 18 విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. కొన్ని కమిటీలు విచారణ చేసి, నివేదికలు ఇచ్చాయి. అయినా ఒక్క కాలేజీపై కూడా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న పాపానపోలేదు. కేవలం భయపెట్టి డబ్బులు దండుకోవడానికే కమిటీలు ఏర్పాటు చేశారు తప్ప కళాశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు టీడీపీ సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రమాణాలు పెంచేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కసరత్తు
ఉన్నత విద్యా రంగం పరిస్థితిని చక్కదిద్దేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఎంబీఏ, ఎంసీఏలోనూ అదే తీరు
ఇటీవలే ఏపీ ఐసెట్ తుది విడత ప్రవేశాలు ముగిశాయి. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు నిర్వహించే కాలేజీలు 457 ఉన్నాయి. వీటిలో 336 ఎంబీఏ కాలేజీల్లో 32,069 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా, 19,891 సీట్లు మాత్రమే నిండాయి. 12,178 సీట్లు మిగిలాయి. ప్రైవేట్ కాలేజీల్లో 11,742 సీట్లు మిగిలిపోగా, యూనివర్సిటీ కాలేజీల్లో 436 సీట్లు మిగిలాయి. 121 ఎంసీఏ కాలేజీల్లో 6,287 సీట్లకు గాను 2,124 సీట్లు భర్తీ కాగా, 4,163 సీట్లు భర్తీ కాలేదు. ఇవి కాకుండా ఈ కాలేజీల్లో ఎంసీఏలోకి లేటరల్ ఎంట్రీ కింద ప్రవేశానికి కేటాయించిన 4,647 సీట్లలో 1,116 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. 8 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరకపోగా, 161 కాలేజీల్లో సీట్లు అధికంగా ఉన్నా ఒక్కో కాలేజీలో 50 మంది కూడా చేరలేదు. 100 మంది లోపు చేరిన కాలేజీల సంఖ్య 292. బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఏమాత్రం ఇష్టపడడం లేదు.
ఇంజనీరింగ్, ఫార్మసీలో..
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో 445 కాలేజీలు ఉండగా, ఇందులో కన్వీనర్ కోటాలో 1,06,203 సీట్లు ఉన్నాయి. ఎంసెట్‌లో అర్హత సాధించినవారు 1,32,997 మంది ఉన్నా కేవలం 68,658 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు సుముఖత చూపి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. వారిలోనూ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారు 68,071 మంది మాత్రమే. ఎంపీసీ స్ట్రీమ్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసే నాటికి కన్వీనర్ కోటా సీట్లలో 60,315 భర్తీకాగా, ఇంకా 45,888 సీట్లు మిగిలి ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో యూనివర్సిటీ కాలేజీల్లో 6,022 సీట్లకు గాను 562 సీట్లు మిగిలాయి. ప్రైవేట్ కళాశాలల్లో ఏకంగా 41,023 సీట్లు మిగిలిపోయాయి. ఇక ఫార్మసీలో యూనివర్సిటీ కాలేజీల్లో 253 సీట్లకు గాను కేవలం 50 సీట్లు భర్తీ కాగా, 203 సీట్లు మిగిలిపోయాయి. ప్రైవేట్ ఫార్మా కాలేజీల్లో 142 సీట్లు భర్తీ కాగా, 3,530 సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. ఫార్మా–డిలో మొత్తం 587 సీట్లుంటే, భర్తీ అయినవి 17 మాత్రమే. 100 లోపు కూడా సీట్లు భర్తీకాని కాలేజీలు 108 ఉన్నాయంటే విద్యారంగం దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. 10 కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. బైపీసీ స్ట్రీమ్‌లో బయోటెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మా–డి విభాగాల్లో 8,601 సీట్లకు గాను 653 సీట్లు మిగిలాయి.
Comments
Please login to add a commentAdd a comment