TDP Government Bought Pegasus Spyware For Tapping Leaders Calls Was Confirmed, Full Details Inside - Sakshi
Sakshi News home page

Pegasus Spyware Controversy: బాబు.. ఏబీ.. ఓ పెగసస్‌ ఇప్పుడేమంటారు..?

Published Sat, Mar 19 2022 2:42 AM | Last Updated on Sat, Mar 19 2022 9:06 AM

TDP Government Bought Pegasus Spyware Illegally - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్‌ నుంచి పెగసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది నూటికి నూరు శాతం నిజమని నిర్ధారణ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో చంద్రబాబు రాజకీయ పన్నాగాలు జాతీయ స్థాయిలో బహిర్గతమయ్యాయి. ఇదే విషయంపై 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసినప్పుడు ఒకింత సందేహాస్పదంగా చూసిన వారంతా, చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా అడ్డదారులేనని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మమతా బెనర్జీ ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ప్రకటన చేశారని అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా స్పైవేర్‌ పరికరాలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ సహకారాన్ని ఆశించారు. అందుకే తాను కొనుగోలు చేసిన స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ సమాచారం గురించి ఆమెకు తెలిపారు. కొనుగోలు చేయాలంటూ సంప్రదింపులు జరిపారు. అప్పటి ఇంటలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో కంపెనీ ప్రతినిధులు పశ్చిమ బెంగాల్‌ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.

అనంతరం ఏపీలో సమర్థంగా ఫోన్ల ట్యాపింగ్‌ చేస్తున్నామని రాష్ట్ర ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ పోలీసు ఉన్నతాధికారులకు ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ అప్రజాస్వామ్యంగా భావించడంతోపాటు నేరమని మమత అప్పట్లో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయదని తేల్చి చెప్పారు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం మమతా బెనర్జీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి మరోమారు చర్చించగా, ఆమె సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.   
 
చంద్రబాబు డైరెక్షన్‌.. ఏబీ యాక్షన్‌
 
టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు కుతంత్రాలకు తెరతీశారు. వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌ ఓ వైపు,  ఓటర్ల డాటా చోరీకి మరోవైపు పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను అప్పటి ప్రభుత్వ ఇంటలిజెన్స్‌ విభాగం చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించారు. ఎందుకంటే అప్పటికే 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి, టీడీపీలో చేర్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఫోన్ల ట్యాపింగ్, డాటా చోరీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు.   
 
3.50 కోట్ల మంది డేటా చోరీ 
రాష్ట్ర ఓటర్ల వ్యక్తిగత వివరాల చోరీకి చంద్రబాబు అండ్‌ కో హైదరాబాద్‌లోని ‘ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే కంపెనీ కేంద్రంగా తెరలేపింది. టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం ‘సేవా మిత్ర’ అనే యాప్‌ను ఈ కంపెనీ రూపొందించింది. ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా కొనుగోలు చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్ర ఓటర్ల వ్యక్తిగత డాటాను తస్కరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ)’ ఆధీనంలో ఉండే అత్యంత విశ్వసనీయమైన ఆధార్‌ డాటాను తస్కరించడం విస్మయ పరుస్తోంది. మరోవైపు బ్యాంకు ఖాతాల డాటాలోకి చొరబడి ఆ వివరాలను కూడా సేకరించారు. ఏకంగా రాష్ట్రంలో 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత వివరాలు చోరీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను భద్రపరిచే బాధ్యతను విశాఖపట్నానికి చెందిన ‘బ్లూ ఫ్రాగ్‌’ అనే కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ వద్ద ఉన్న లబ్ధిదారుల వివరాలను కూడా ఐటీ గ్రిడ్స్‌ కంపెనీకి అందుబాటులోకి తెచ్చింది. దాంతో టీడీపీ ప్రచారం కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌ను రాష్ట్రంలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు, బాం్యకు ఖాతాలు, ఇతర వ్యక్తిగత సమాచారంతో అనుసంధానించారు.  
 
కుట్రపై అప్పట్లోనే ఫిర్యాదు 
అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతోపాటు టీడీపీ అనుకూల ఓటర్ల పేర్లను ఒకటికి మించి నియోజకవర్గాల్లో చేర్చేందుకు ఎత్తుగడ వేశారు. 2019 ఎన్నికల్లో భారీ అక్రమాలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేశారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లింది. మరోవైపు ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ డేటా చోరీకి పాల్పడుతుండటంపై హైదరాబాద్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై హైదరాబాద్‌ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో తనిఖీలు చేయడంతో మొత్తం బండారం బట్టబయలైంది. దాంతో ఆ కంపెనీకి చెందిన రెండు కార్యాలయాల్లో ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై కేసు నమోదు చేశారు. డేటా చోరీకి పాల్పడుతున్న కేసులో ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ ప్రతినిధులతోపాటు ఏపీ నిఘా విభాగానికి చెందిన కొందరు సిబ్బందిని కూడా హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడం టీడీపీ కుట్రను బహిర్గతం చేసింది.  
 
ట్యాపింగ్‌ నిజమేనన్న టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు  
అప్పట్లో చంద్రబాబు, ఆయన బృందం వైఎస్సార్‌సీపీ కీలక నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. అందుకోసం అప్పటి నిఘా విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు అధునాతన సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘ఏరోస్టర్‌ ’ అనే ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలను తెప్పించినట్టు సమాచారం. గాలిలో ఎగురవేసే ఈ ఏరోస్టర్‌ బెలూన్లలో ఉండే ప్రత్యేకమైన పరికరాలు ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు అవసరమైన ఫొటోలు తీస్తూ నిఘా వ్యవస్థగా పని చేస్తాయి. చంద్రబాబు కుతంత్రాలపై సందేహించిన వైఎస్సార్‌సీపీ నేతలు ఫోన్ల ట్యాపింగ్‌ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లను కూడా బాధ్యులను చేశారు. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేయాలని తమకు అప్పటి నిఘా విభాగం అధికారులు లేఖ ద్వారా ఆదేశించారని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు వెల్లడించడం గమనార్హం.  
 
కేంద్ర భద్రతా చట్టాల ఉల్లంఘన 
రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్‌ కోసం చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర భద్రతా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. ‘ఏరోస్టర్‌’ స్పైవేర్‌ పరికరాల కోసం అప్పటి ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారిక హోదాతో ఇజ్రాయెల్‌ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. దేశ భద్రతతో ముడిపడిన స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయాలంటే కచ్చితంగా కేంద్ర రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల శాఖల ముందస్తు అనుమతి ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు పొందిన తన కుమారుడు చేతన్‌ సాయి కృష్ణ సీఈవోగా ఉన్న ఆకాశ్‌ అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీకి ఆ స్పైవేర్‌ పరికరాలను సరఫరా  చేయాలని కోరా>రు. ఆ కంపెనీనే ఇజ్రాయెల్‌ నుంచి నిఘా పరికరాల కొనుగోలుకు ప్రధాన బిడ్డర్‌గా వ్యవహరించింది. దీనిపై పూర్తి ఆధారాలు లభించినందునే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసి, కేసు నమోదు చేసింది. ఐపీఎస్‌ అధికారిగా ఉంటూ కూడా దేశ భద్రతా చట్టాలను ఉల్లంఘించిన ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీవోపీటీ)కు నివేదించింది.  
 
ట్యాపింగ్‌ కోసమే వాటి వినియోగం  
ఇజ్రాయెల్‌కు చెందిన వెర్టిన్‌ అనే కంపెనీ ద్వారానే చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్‌ కంపెనీతో వ్యవహారం నెరిపింది. వెబ్‌ ఇంటలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు పేరుతో ‘ఐఎంఎస్‌ఐ క్యాచర్స్‌’ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను తెప్పించింది. ఫోన్ల ట్యాపింగ్‌ కోసమే ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ఈ విషయంపై 2019 ఎన్నికల పోలింగ్‌ ముగిశాక.. ఫలితాలు వెల్లడయ్యేలోపు ఆ సాఫ్ట్‌వేర్‌ కోసం రూ.12.50 కోట్లు ఆ కంపెనీకి చెల్లించేందుకు ఫైల్‌ నడిపింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లి చెల్లింపులు చేయొద్దని కోరారు. వెర్టిన్‌ కంపెనీకి ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ పరికరాల ఉత్పత్తిదారు ఎన్‌ఎస్‌వో కంపెనీతో సాన్నిహిత్యం ఉంది. ఒకే రకమైన స్పైవేర్‌ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ఆ రెండు కంపెనీలు విలీనం కావాలని ఒకానొక దశలో భావించాయి కూడా.  
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement