
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ద్వారా మానవ హక్కులను చోరీచేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపీ శాసనసభా సంఘం (హౌస్ కమిటీ) బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్‌రావు, మద్దాళి గిరిధర్ సమావేశమై ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారిస్తున్నారు.
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ఏపీ (చంద్రబాబు) ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్య పరికరాలను వినియోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఏపీ అసెంబ్లీ మార్చిలో సభాసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సమావేశం అనంతరం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసింది. సాధికార సర్వే ద్వారా సమాచారం సేకరించి అప్రజాస్వామిక విధానాలు అవలంభించారు. దోషులను ప్రజల ముందు నిలబెడతాం. అప్పట్లో ప్రయివేటు వ్యక్తుల ఫోన్లు టాప్ చేసింది. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తాం. మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు కూడా ఒక అంశం. చంద్రబాబు చేసిన నిర్వాకాన్ని ఎత్తి చూపుతాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఆరోపణలు చేశామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
చదవండి: (గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ)
Comments
Please login to add a commentAdd a comment