
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న రాష్ట్రానికి రానున్న ఆయన వారంపాటు ఇక్కడే బస చేసే అవకాశముంది. ఈ మేరకు రాహుల్‌గాంధీ షెడ్యూల్‌ను టీపీసీసీ రూపొందిస్తుండగా, ఈనెల 17న ఆయన వరంగల్, పాలకుర్తి, భువనగిరిల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
ఈనెల 16 తర్వాత ఎన్నికల ప్రచారాన్ని హోరె త్తించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్‌తో పాటు ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేలను కూడా రంగంలోకి దించనుంది. రాహుల్ తెలంగాణలో ఉన్నప్పుడే ఏదో ఒక రోజు ఆ ఇద్దరూ కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
రెబెల్స్‌కు బుజ్జగింపులు
రెబెల్స్‌గా బరిలోకి దిగిన పార్టీ నేతలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ సోమవారం పలువురు రెబెల్స్‌తో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రంలో 15 చోట్ల రెబెల్స్ బరిలో ఉన్నట్లు నాయకత్వం గుర్తించిందని, వారితో సంప్రదింపులు మంగళవారం పూర్త వుతాయని సమాచారం. రెబెల్స్ పోటీలో లేకుండా చూస్తామని పార్టీ వర్గాలంటున్నాయి.