సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(ఆదివారం) నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవునున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. ఇక, అందరి దృష్టి ముఖ్యంగా తెలంగాణ ఫలితాలపైనే ఉంది. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? లేక, కర్ణాటకలో మాదిరిగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందా? అనే చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నాడంటే..
కాగా, శుక్రవారం కేరళలోని కొచ్చిలో మహిళా కాంగ్రెస్ నేతల సదస్సు ‘ఉత్సాహ్’ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని మరింత ప్రోత్సహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలో ఇంకా చాలా మంది మహిళా నాయకులను తయారు చేయాలని, దేశంలో వచ్చే పదేళ్లలో 50 శాతం మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తమ కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రులు కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగిన మహిళా నాయకులు కాంగ్రెస్‌లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రయత్నించాలి, లక్ష్యం సాధించాలి అని సూచించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రేవంత్ వ్యాఖ్యల వెనుక..
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సపోర్టుగా ఒకానొక సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తామని కామెంట్స్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో, సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే అంశం తెరపైకి వచ్చింది.
ఇక, సీతక్క విషయానికి వస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ములుగు ఏజెన్సీ నుంచి గెలిచి.. అసెంబ్లీ వేదికగా పలుమార్లు బీఆర్‌ఎస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పలు సందర్బాల్లో సీతక్కను బీఆర్‌ఎస్ సభ్యులు సైతం అభినందించిన ఘటనలు ఉన్నాయి.
మరోవైపు.. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును మద్దుతిస్తున్న సమయంలో కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. రాజకీయంగా మహిళలకు మద్దతివ్వాలన్నారు. కానీ, ఎన్నికల విషయం వచ్చే సరికి.. తెలంగాణలో కేవలం 11 మంది మహిళా అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇచ్చారు. దీంతో, కాంగ్రెస్ తీరును కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని ఘాటు విమర్శలు చేస్తున్నారు.
Congress is ruling Rajasthan, Himachal, Chhattisgarh, Karnataka.
— Ankur Singh (@iAnkurSingh) December 1, 2023
How many women Chief Ministers? Even deputy CM?
Himachal Congress doesn't even have a woman minister. Telangana their CM candidate is not woman.
Check how many woman ministers in Rajasthan and Karnataka. https://t.co/bnCXCf5TaF
కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు వీరే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 మంది మహిళలకు అవకాశమిచ్చింది. అందులో నలుగురు హైదరాబాద్‌లోని నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. మూడు ఎస్సీ నియోజకవర్గాలు, ఒక ఎస్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గోషా మహల్‌లో మొగిలి సునీత, సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) స్థానంలో జీవీ వెన్నెలను పోటీలో నిలిపింది.
వీరు కాకుండా గద్వాలలో సరిత తిరుపతయ్య, కోదాలలో నలమాడ పద్మావతి రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) స్థానంలో సింగపురం ఇందిర, పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఈస్ట్‌లో కొండా సురేఖ, ములుగు(ఎస్టీ)లో సీతక్క, సత్తుపల్లి(ఎస్సీ) స్థానంలో మట్టా రాగమయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment