అధికారంలోకి రాగానే...ఆరు గ్యారంటీలపై సంతకాలు | Congress Leaders Rahul Gandhi Comments On BJP And BRS MIM Parties | Sakshi
Sakshi News home page

అధికారంలోకి రాగానే...ఆరు గ్యారంటీలపై సంతకాలు

Published Wed, Nov 29 2023 4:13 AM | Last Updated on Wed, Nov 29 2023 4:13 AM

Congress Leaders Rahul Gandhi Comments On BJP And BRS MIM Parties - Sakshi

మల్కాజిగిరి రోడ్డు షోలో రేవంత్‌రెడ్డి, ప్రియాంకగాందీతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న రాహుల్‌గాంధీ

సాక్షి, హైదరాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి (హైదరాబాద్‌): తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాల అమలుపై మంత్రివర్గం సంతకాలు చేస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మళ్లీ దొరల సర్కారే ఏర్పడుతుందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్‌ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజా సర్కార్‌ కోసం బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. దేశంలో మత విద్వేషాలు లేకుండా చేసేందుకు ఢిల్లీలో నరేంద్ర మోదీని గద్దె దింపాలంటే, ముందుగా తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలని అన్నారు.

దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. మోదీ విద్వేషాలతో కూడిన భారతదేశాన్ని తయారు చేశారని, తాము ప్రేమతో కూడిన దేశాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో ప్రేమను పంచాలనే లక్ష్యంతోనే భారత్‌ జోడో యాత్ర చేశానని, ఈ సందర్భంగా ప్రజల కష్టాలను నేరుగా చూశానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం.. హైదరాబాద్‌ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని బజార్‌ఘాట్‌ చౌరస్తాలో, మల్కాజిగిరి ఇందిరా చౌక్‌ వద్ద నిర్వహించిన కార్నర్‌ మీటింగుల్లో రాహుల్‌ మాట్లాడారు.

మోదీతో రాజీపడే ప్రసక్తే లేదు
‘కాంగ్రెస్‌ పోరాటం కేవలం కాషాయం విద్వేషాలపైనే. మోదీతో రాజీ పడే ప్రసక్తే లేదు. బీజేపీకి బీఆర్‌ఎస్, ఎంఐఎం బీ టీం కాకుంటే అవినీతిపరుడైన కేసీఆర్‌తో పాటు ఒవైసీపై ఒక్క కేసు, ఈడీ దాడులు ఎందుకు లేవు? మోదీ సర్కార్‌ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. ఉత్తరాది, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో మజ్లిస్‌ పారీ్టకి కనీసం ఉనికి, ఒక్క ఓటు లేకున్నా బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎన్నికల బరిలో దిగుతుంది. మజ్లిస్‌ ఎక్కడ పోటీ చేయాలో కూడా బీజేïపీ నిర్ణయిస్తోంది. కేవలం కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే మజ్లిస్‌ ఉద్దేశం. ఈ మూడూ ఒకటే టీమ్‌. కలిసే పనిచేస్తాయి..’ అని రాహుల్‌ ధ్వజమెత్తారు.

నేను, ప్రియాంక సైనికుల్లా ఉంటాం
‘అధికారంలోకి వస్తే తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకున్నదంతా తిరిగి ప్రజల జేబులో వేస్తాం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే అందిస్తాం. విద్యార్థులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం..’ అని హామీ ఇచ్చారు. ప్రజల తరఫున ఢిల్లీలో పోరాడడానికి తాను, సోదరి ప్రియాంక సైనికుల్లా ఉంటామని రాహుల్‌ చెప్పారు.  

అసలు ప్రభుత్వాన్ని చూపిస్తాం: ప్రియాంక
పది సంవత్సరాల తెలంగాణలో ప్రజలకు కేసీఆర్‌ ఇల్లు ఇచ్చారా? అని ప్రజలను ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. పదేళ్లూ ఫాంహౌస్‌ పాలన కొనసాగిందని, ఆయన కుటుంబంలోని వారికి మంత్రి పదవులు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్‌ గెలిస్తే అసలు ప్రభుత్వాన్ని చూపిస్తామని అన్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో బోనాలతో మహిళలు, కల్లు గీసే పనిముట్లతో గీత కారి్మకులు, వలలు పట్టుకుని గంగపుత్రులు పాల్గొన్నారు. మూడు రంగుల జెండా పాటకు రాహుల్, ప్రియాంక, రేవంత్, హన్మంతరావు ఉత్సాహంగా నృత్యం చేశారు.

కాగా జూబ్లీహిల్స్‌ యూసుఫ్‌గూడలో కార్యక్రమానంతరం అక్కడి నుంచి నాంపల్లి కార్నర్‌ మీటింగ్‌కు రాహుల్‌ ఆటోలో వచ్చారు. రాహుల్‌ తన ఆటోలో ప్రయాణించడం జీవితంలో మరిచిపోనంటూ ఆటో డ్రైవర్‌ ఆశోక్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, నాంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్ధులు ఫిరోజ్‌ ఖాన్, అజారుద్దీన్, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement