women cm
-
రాహుల్ వ్యాఖ్యల మర్మమేంటి?.. సీఎంగా సీతక్క?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(ఆదివారం) నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవునున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. ఇక, అందరి దృష్టి ముఖ్యంగా తెలంగాణ ఫలితాలపైనే ఉంది. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? లేక, కర్ణాటకలో మాదిరిగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందా? అనే చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నాడంటే.. కాగా, శుక్రవారం కేరళలోని కొచ్చిలో మహిళా కాంగ్రెస్ నేతల సదస్సు ‘ఉత్సాహ్’ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని మరింత ప్రోత్సహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలో ఇంకా చాలా మంది మహిళా నాయకులను తయారు చేయాలని, దేశంలో వచ్చే పదేళ్లలో 50 శాతం మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తమ కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రులు కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగిన మహిళా నాయకులు కాంగ్రెస్‌లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రయత్నించాలి, లక్ష్యం సాధించాలి అని సూచించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల వెనుక.. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సపోర్టుగా ఒకానొక సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తామని కామెంట్స్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో, సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే అంశం తెరపైకి వచ్చింది. ఇక, సీతక్క విషయానికి వస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ములుగు ఏజెన్సీ నుంచి గెలిచి.. అసెంబ్లీ వేదికగా పలుమార్లు బీఆర్ఎస్పై ప్రశ్నల వర్షం కురిపించారు. పలు సందర్బాల్లో సీతక్కను బీఆర్ఎస్ సభ్యులు సైతం అభినందించిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు.. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును మద్దుతిస్తున్న సమయంలో కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. రాజకీయంగా మహిళలకు మద్దతివ్వాలన్నారు. కానీ, ఎన్నికల విషయం వచ్చే సరికి.. తెలంగాణలో కేవలం 11 మంది మహిళా అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇచ్చారు. దీంతో, కాంగ్రెస్ తీరును కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని ఘాటు విమర్శలు చేస్తున్నారు. Congress is ruling Rajasthan, Himachal, Chhattisgarh, Karnataka. How many women Chief Ministers? Even deputy CM? Himachal Congress doesn't even have a woman minister. Telangana their CM candidate is not woman. Check how many woman ministers in Rajasthan and Karnataka. https://t.co/bnCXCf5TaF — Ankur Singh (@iAnkurSingh) December 1, 2023 కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు వీరే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 మంది మహిళలకు అవకాశమిచ్చింది. అందులో నలుగురు హైదరాబాద్‌లోని నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. మూడు ఎస్సీ నియోజకవర్గాలు, ఒక ఎస్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గోషా మహల్లో మొగిలి సునీత, సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) స్థానంలో జీవీ వెన్నెలను పోటీలో నిలిపింది. వీరు కాకుండా గద్వాలలో సరిత తిరుపతయ్య, కోదాలలో నలమాడ పద్మావతి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) స్థానంలో సింగపురం ఇందిర, పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఈస్ట్‌లో కొండా సురేఖ, ములుగు(ఎస్టీ)లో సీతక్క, సత్తుపల్లి(ఎస్సీ) స్థానంలో మట్టా రాగమయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. -
దీదీ కావాలా.. లాకెట్ కావాలా..!
బెంగాల్ ఎన్నికల్లో ఒక నినాదం బలంగా వినిపిస్తోంది. ‘మీకు దీదీ కావాలా లాకెట్ కావాలా’ అని. దీదీ అంటే మమతా బెనర్జీ. లాకెట్ అంటే లాకెట్ చటర్జీ. గత ఐదేళ్లుగా బిజెపిలో పని చేస్తూ ఎం.పిగా గెలిచి ఇప్పుడు కీలకమైన ఎన్నికలు అయినందున అసెంబ్లీ బరిలో దిగిన లాకెట్ చటర్జీ అన్నీ అనుకున్నట్టుగా అయితే బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి అని కొందరు జోస్యం చెబుతున్నారు. బెంగాల్లో మహా శక్తి అయిన మమతా బెనర్జీని ఈ మాజీ నటి సమర్థంగా ఎదుర్కొంటూ వార్తల్లో నిలవడం విశేషమే. పాపులర్ విన్యాసాల ద్వారా జనాన్ని ఆకర్షిస్తున్న ఈ మహిళా నేత పరిచయం... కళాకారులకు జనాకర్షక పద్ధతులు బాగానే తెలుస్తాయి. ఎలక్షన్లలో దిగిన సినిమా తారలు తమ అయస్కాంత శక్తితో సగటు ఓటరును గట్టిగా లాగగలరనేదానికి లాకెట్ చటర్జీ కూడా ఒక ఉదాహరణే. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు బి.జె.పి తరఫున ఎవరైనా గట్టి మహిళా నాయకురాలు ఉందంటే అది ఈ లాకెట్ చటర్జీనే. బెంగాల్‌కు మహిళా ముఖ్యమంత్రి పని చేసే ఆనవాయితీని కొనసాగించాలని బి.జె.పి అనుకుంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ పార్టీ గెలిస్తే లాకెట్ చటర్జీ రసగుల్లా విరిగి పాకంలో పడ్డట్టే. ఎందుకంటే ఆమెకు మాత్రమే ఆ పార్టీ తరఫున మహిళా సి.ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరీ లాకెట్ చటర్జీ లాకెట్ చటర్జీది కోల్‌కతా ఉత్తర ప్రాంతంలో ఉండే దక్షిణేశ్వర్. ఇక్కడ కూడా ఒక కాళీ ఆలయం ఉంది. ఆమె తండ్రి అందులో పురోహితుడుగా పని చేసేవాడు. లాకెట్ చటర్జీకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి ఏర్పడింది. భరత నాట్యం, కథక్ నేర్చుకుని బెంగాల్ నటి మమతా శంకర్ ట్రూప్‌లో 13 ఏళ్ల వయసులోనే చేరి ప్రదర్శనలు మొదలెట్టింది. ఒక వైపు దక్షిణేశ్వర్లో చదువుకుంటూనే సినిమాల్లో ప్రవేశించింది. దాదాపు 35 సినిమాల్లో నటించింది. అయితే అవన్నీ ద్వితీయ శ్రేణి సినిమాలు అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద తారాగణం ఉండే భారీ సినిమాలు ఆమెకు దక్కలేదు. ఆమె నటించిన ఒక సినిమా తెలుగు డబ్బింగ్‌తో యూ ట్యూబ్‌లో ఉంది. సినిమా రంగంలో తన ప్రస్తావనను ముగించి ఆమె 2015లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరింది. అయితే కొద్దిరోజులకే అక్కడ ఇమడలేక బయటకు వచ్చి బి.జె.పిలో చేరింది. 2016లో ప్రత్యక్ష ఎన్నికలలో... 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లలో బి.జె.పి తరఫున మాయురేశ్వర్ నుంచి లాకెట్ చటర్జీ నిలబడింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ బి.జె.పి ఆమెను 2019 పార్లమెంట్ ఎలక్షన్లలో ‘హుగ్లీ’ నియోజకవర్గం నుంచి నిలబెడితే ఆశ్చర్యకరంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ 18 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నింటికి బి.జె.పి ఇప్పుడు లాకెట్‌ను ప్రచార కార్యదర్శి చేసింది. అంతే కాదు ‘చిన్సుర’ (చుచుర) నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఏ అభ్యర్థి గా నిలబెట్టింది. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి లాకెట్ రేయింబవళ్లు కష్టపడుతోంది. సైకిల్ ప్రచారం లాకెట్ చటర్జీ విభిన్న ప్రచార రీతులను పాటించడంలో సమర్థురాలు. తాను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినప్పుడు పూర్తి ప్రచారాన్ని సైకిల్ మీద, స్కూటర్ మీద నిర్వహించింది. ఇప్పుడు కూడా సైకిల్ మీద ఎక్కువగా తిరుగుతూ పార్టీ కోసం ప్రచారం చేస్తోంది. అవసరమైన చోట కార్యకర్తలతో కలిసి పోలీసుల మీద, ప్రత్యర్థుల మీద కలబడిన రికార్డు ఆమెకు ఉంది. ప్రస్తుతం హుగ్లీ నది మీద పడవలో తిరుగుతూ ఆమె పడుతున్న శ్రమ ఓటర్ల దృష్టిలోనే కాదు మీడియా దృష్టిలో కూడా పడుతోంది. సొంతగా చేతితో రాసిన పోస్టర్లను విడుదల చేసి తృణమూల్‌తో ఐసల్ ఫైసల్ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. మమతాపై దాడి లాకెట్ చటర్జీని మమతాపై దాడికి పార్టీ ఎక్కువ ఉపయోగించుకుంటోంది. లాకెట్ కూడా సమర్థమైన వాదనే ఓటర్ల ముందు వినిపిస్తోంది. ‘స్త్రీలు తమకేదైనా మేలు జరుగుతుందని మహిళా సి.ఎంగా మమతా బెనర్జీని ఎన్నుకున్నారు. రెండుసార్లు పదవి ఇచ్చారు. కాని ఆమె వారి కోసం ఏమీ చేయలేదు. పశ్చిమ బెంగాల్లో ఉమెన్ ట్రాఫికింగ్ అత్యధికంగా ఉంది. గృహ హింస ఎక్కువ గా ఉంది. యాసిడ్ దాడులైతే దేశంలోనే బెంగాల్లో అత్యధికం. కిడ్నాప్ కేసులకు అతీగతీ లేదు. ఇవన్నీ మమతా బెనర్జీ వైఫల్యాలు. స్త్రీలు ఇవన్నీ గమనించారు. వారు ఈ.వి.ఎంల ద్వారా తమ ప్రతీకారం తీర్చుకుంటారు’ అని లాకెట్ తన ప్రచారంలో మాట్లాడుతూ ఉంది. అవతలి వైపు అయితే అవతలి వైపు నుంచి చూస్తే లాకెట్‌కు అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేము. హుగ్లీ నదిపై ఆధునిక ఘాట్ కట్టి వారణాసిలోలాగా హారతి కార్యక్రమం చేస్తామని ఆమె చేస్తున్న హామీలు ఆకర్షిస్తున్నా మాకు ఉపాధి కావాలి అనే యువతే ఆమెకు ఎక్కువగా ఎదురు పడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అభివృద్ధి చేసిందో చేయలేదో బి.జె.పి వస్తే మొత్తం వాతావరణం దెబ్బ తింటుందని భయపడుతున్నాం అనేవారూ ముఖ్యంగా పై వయసు వారు ఆమె ప్రచార పరిధిలో కనిపిస్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా తమ ప్రచారంలో జూన్ మలియా, కౌషాని ముఖర్జీ, లౌలీ మైత్ర వంటి ఈకాలపు తారలను రంగంలో దించి ఉంది. హోరాహోరీగా సాగుతున్న ఈ పోటీలో విజేతలెవరో అన్న ఉత్కంఠ తప్పక నెలకొని ఉంది. ఎవరు గెలిచినా బెంగాల్ మళ్లీ మహిళా సి.ఎంనే చూస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
'మహిళా సీఎం రాష్ట్రాల్లోనూ వారికి రక్షణ లేదు'
కోల్ కతా: మహిళా ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లోనూ మహిళలకు రక్షణ కరువైందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ పరిస్థితి నిజంగా దురదృష్టకరమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కోల్ కతా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ పరిస్థితిలో మనం మార్పులు తీసుకురావాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లవుతున్నా పల్లెటూళ్లలో మహిళల కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని ఆయన బాధపడ్డారు. పాఠశాలలు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయని, మంచి ప్రభుత్వ పాలన అందిస్తే ఇటువంటివి ఉండవని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని ఇక్కడి ర్యాలీలో మంత్రి అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని, జనాభాలో వారు సగం ఉన్నారన్నారు. మహిళలు అభివృద్ధి చెందనిదే అన్ని రంగాల్లో వృద్ధి సాధ్యంకాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. -
గీతా...అరుణ....జయ...విజయ...
ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన తెలంగాణ సీనియర్ నేతలకు ...కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, చినబాబు రాహుల్ గాంధీ అనుకోని రీతిలో ఝలక్ ఇచ్చారు. తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటిస్తే.... బీసీ ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ముందుకు వెళుతుంటే.... యువరాజు తాజాగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి మహిళ కావాలన్నది తన కోరిక అని బాంబు పేల్చారు. దీంతో సీఎం పోస్ట్‌పై ఆశలు పెట్టుకున్న టీ.కాంగ్రెస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అవకాశం ఉంటే తనకు ముఖ్యమంత్రి పదవి కూడా రావచ్చేమోనని చెప్పిన వి.హనుమంతరావు రాహుల్ సభలో జరిగిన అవమానంతోనే దానిపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ ప్రకటనతో అప్పుడే తెలంగాణలో చర్చలు జోరందుకున్నాయి. గీత... అరుణ... జయసుధ.... విజయశాంతి, సునీత లక్ష్మారెడ్డి ఇలా అనేక పేర్లు తెరమీదకు వచ్చేశాయి. తెలంగాణ మహిళా నేతలలో మాజీ మంత్రి గీతారెడ్డి బాగా సీనియర్. ఓ దశలో ఆమె ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీ పడిన విషయం తెలిసిందే. రాహుల్ తాజా ప్రకటనతో ఆమెకు సీఎం పదవిపై ఆశలు పెరిగాయి. గద్వాల్ మహిళా నేత, మరో మాజీమంత్రి డీకే అరుణ కూడా తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు అప్పట్లో ఫీలర్లు వదిలారు. ఇక సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జయసుధ, అలాగే ఇటీవలే కారును వదిలి చేయందుకున్న విజయశాంతి పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. అలాగే మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా సీఎం అభ్యర్థి జాబితాలో ఉన్నా.. ఎంతవరకూ అవకాశం దక్కుతుందో చూడాలి. ఏమో గుర్రం ఎగురా వచ్చు ...అన్నట్లు తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికి వరిస్తుందో చూడాలి మరి.