'మహిళా సీఎం రాష్ట్రాల్లోనూ వారికి రక్షణ లేదు'
కోల్ కతా: మహిళా ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లోనూ మహిళలకు రక్షణ కరువైందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ పరిస్థితి నిజంగా దురదృష్టకరమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కోల్ కతా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ పరిస్థితిలో మనం మార్పులు తీసుకురావాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లవుతున్నా పల్లెటూళ్లలో మహిళల కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని ఆయన బాధపడ్డారు. పాఠశాలలు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయని, మంచి ప్రభుత్వ పాలన అందిస్తే ఇటువంటివి ఉండవని పేర్కొన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని ఇక్కడి ర్యాలీలో మంత్రి అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని, జనాభాలో వారు సగం ఉన్నారన్నారు. మహిళలు అభివృద్ధి చెందనిదే అన్ని రంగాల్లో వృద్ధి సాధ్యంకాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు.