గీతా...అరుణ....జయ...విజయ...
ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన తెలంగాణ సీనియర్ నేతలకు ...కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, చినబాబు రాహుల్ గాంధీ అనుకోని రీతిలో ఝలక్ ఇచ్చారు. తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటిస్తే.... బీసీ ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ముందుకు వెళుతుంటే.... యువరాజు తాజాగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి మహిళ కావాలన్నది తన కోరిక అని బాంబు పేల్చారు.
దీంతో సీఎం పోస్ట్పై ఆశలు పెట్టుకున్న టీ.కాంగ్రెస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అవకాశం ఉంటే తనకు ముఖ్యమంత్రి పదవి కూడా రావచ్చేమోనని చెప్పిన వి.హనుమంతరావు రాహుల్ సభలో జరిగిన అవమానంతోనే దానిపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ ప్రకటనతో అప్పుడే తెలంగాణలో చర్చలు జోరందుకున్నాయి. గీత... అరుణ... జయసుధ.... విజయశాంతి, సునీత లక్ష్మారెడ్డి ఇలా అనేక పేర్లు తెరమీదకు వచ్చేశాయి. తెలంగాణ మహిళా నేతలలో మాజీ మంత్రి గీతారెడ్డి బాగా సీనియర్. ఓ దశలో ఆమె ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీ పడిన విషయం తెలిసిందే. రాహుల్ తాజా ప్రకటనతో ఆమెకు సీఎం పదవిపై ఆశలు పెరిగాయి.
గద్వాల్ మహిళా నేత, మరో మాజీమంత్రి డీకే అరుణ కూడా తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు అప్పట్లో ఫీలర్లు వదిలారు. ఇక సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జయసుధ, అలాగే ఇటీవలే కారును వదిలి చేయందుకున్న విజయశాంతి పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. అలాగే మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా సీఎం అభ్యర్థి జాబితాలో ఉన్నా.. ఎంతవరకూ అవకాశం దక్కుతుందో చూడాలి. ఏమో గుర్రం ఎగురా వచ్చు ...అన్నట్లు తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికి వరిస్తుందో చూడాలి మరి.