భారత పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి పాతికేళ్లయింది. పార్లమెంటులో, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒకవంతు లేక 33 శాతం సీట్లను ప్రత్యేకించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును మొట్టమొదటగా 1996 సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టారు. కానీ దాని భవిష్యత్తు మాత్రం ఇప్పటికీ ఊగిసలాటతోనే ఉంది. ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వచ్చినా, మళ్లీ ప్రవేశపెట్టినా సరే, పార్లమెంటులో అది రభసకు, నాటకీయ పరిణామాలకు దారితీస్తూ వచ్చింది. ప్రస్తుతం చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కాస్త మెరుగుపడింది కానీ, రాజకీయ నేతలతో పోలిస్తే భారత మహిళా నేతల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. చట్టసభల్లో మహిళల సంఖ్యను పెంచే విషయంలో చేయవలసింది ఎంతో ఉందని గుర్తించాలి. చాలా దేశాలు జెండర్ ఆధారిత కోటాను పూరించడంలో ఏదోరకమైన పురోగతి సాధించాయి కానీ భారత పార్లమెంటు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును రెండు దశాబ్దాలకు పైగా పదే పదే అడ్డుకోవడం అత్యంత శోచనీయమైన విషయం.
పార్లమెంటులో చాలా బిల్లులు శాసన రూపం దాల్చకుండా ఆగి పోయి ఉండవచ్చు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పట్టిన గతి మరే బిల్లుకూ పట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఆ బిల్లును ప్రవేశపెట్టి పాతికేళ్లయింది, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయాయి కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం సభ ఆమోదానికి వేచి చూస్తూనే ఉంది. పార్లమెం టులో, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒకవంతు లేక 33 శాతం సీట్లను ప్రత్యేకించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును మొట్టమొదటగా 1996 సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టారు. ఇటీవలి సంవత్సరాల్లో చట్టసభల్లో, అధికార పీఠాల్లో మహిళల ప్రాతి నిధ్యం కాస్త మెరుగుపడింది కానీ ఎన్నికైన రాజకీయ నాయకులతో పోలిస్తే భారతీయ మహిళానేతల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1996 తర్వాత ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వచ్చినా, మళ్లీ ప్రవేశపెట్టినా సరే, పార్లమెంటులో అది రభసకు, నాటకీయ పరిణామాలకు, బిల్లు కాగి తాలను విసిరేయడానికి దారితీస్తూ వచ్చింది. ఇంకా ముఖ్యంగా దానికి వ్యతిరేకంగా అన్ని రకాల అడ్డంకులను సృష్టిస్తూ వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎప్పుడు చట్టసభలో చర్చకు పెట్టినా అది పేలడానికి సిద్ధంగా ఉన్న కాలాతీత బాంబును తలపిస్తూ వచ్చింది. కాలంతో పనిలేని బాంబు అని ఎందుకనాల్సి వచ్చిందంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టినా సరే, మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ కల్లోలాన్ని సృష్టించింది.
రాజ్యసభను దాటని బిల్లు
పాతికేళ్లుగా మహిళా బిల్లును ఏదోవిధంగా రాజకీయ పార్టీలు అడ్డుకుని, పార్లమెంటులో దానికి ఆమోదం లభించకుండా తమదైన పాత్ర పోషిస్తూ వచ్చాయి. 1998, 1999లలో చివరకు 2008లో కూడా ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రద్దయిన రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వీగిపోతూ వచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు ‘కోటాలో కోటా’ను కల్పించాలని కొత్త సవరణను చేర్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ ఈరోజుకీ అది పార్లమెంటులో పెండింగులో ఉంటూ వస్తోంది.
ఈ పాతికేళ్లలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలనే ఆకాంక్ష విషయంలో, రాజకీయ నాయకులను పార్టీలకు అతీతంగా ఐక్యపరిచిన ఘటన మరే బిల్లు విషయంలోనూ జరగలేదు. ఈ బిల్లుకు సంబంధించి సాంకేతిక సమస్యలను ఇప్పటికీ పరిష్కరించాల్సిన అవసరముందని చట్టసభలపై నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ ప్రాతిపదిక హేతుబద్ధతను నిర్ణయించే విధానాలపై నిశితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కాదనలేం. వరుసగా మూడు సాధారణ ఎన్నికల తర్వాత ఒక సీటును మహిళలకు రిజర్వు చేయాలని మొదటిసారిగా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపాదించారు. ఇది కూడా చర్చనీయాంశమైంది. కానీ ఇవేవీ బిల్లు ఉనికినే తోసిపుచ్చేటంత స్థాయిలో లేవు. బిల్లుకు ఆమోదం లభించినప్పుడు ఇలాంటి అంశాలను సులభంగా పరిష్కరించవచ్చు.
లైంగిక సమానత్వం సాధ్యమేనా?
చట్టసభల్లో లింగ వైవిధ్యతను మెరుగుపర్చడం గురించి ప్రపంచవ్యాప్తంగా అరుపులు, పెడబొబ్బలు వినపడుతూనే ఉన్నాయి. కానీ అంతర్జాతీయంగా చూస్తే ఇంతవరకు 14 దేశాల్లో మాత్రమే మహిళలు మంత్రివర్గాల్లో 50 శాతం సీట్లను కైవసం చేసుకున్నారు. యూఎన్ విమెన్ సంస్థ చెప్పినదాని ప్రకారం ప్రస్తుతం 24 దేశాల్లో దేశాధినేతలుగా లేక ప్రభుత్వాధినేతలుగా 26 మంది మహిళలు మాత్రమే అధికారంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుత వేగంతోనే సాగితే ప్రపంచంలో లైంగిక సమానత్వం ఏర్పడాలంటే మరొక 130 సంవత్సరాల సమయం పట్టేటట్లుంది.
ఆయా దేశాల పార్లమెంట్లలో మహిళలు 25 శాతం మాత్రమే చోటు సంపాదించుకున్నారు. నాలుగు దేశాల పార్లమెంట్లలో మాత్రమే 50 శాతం మహిళలు కనబడుతున్నారు. ఇక 19 దేశాల్లో మాత్రమే 40 శాతం మంది మహిళలు పార్లమెంటుకు వెళ్లగలిగారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు లింగపరమైన కోటాను పూరించడంలో ఏదోరకమైన పురోగతి సాధించాయి కానీ భారత పార్లమెంటు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును పదే పదే అడ్డుకోవడం అత్యంత శోచనీయమైన విషయం.
నిజంగానే ప్రస్తుతం భారత పార్లమెంటులో మహిళల ప్రాతి నిధ్యం మెరుగైంది. మొట్టమొదటి లోక్‌సభలో 24 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉండటం విశేషమని పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. 1996లో లోక్‌సభలో మహిళలు 7.7 శాతం మంది, రాష్ట్రాల శాసనసభల్లో 4 శాతం మంది మహిళా ప్రతినిధులు ఉండగా, వీరితో పోలిస్తే ఇప్పుడు పార్లమెంటులో 14.4 శాతం మంది, రాష్ట్రాల శాసనసభల్లో 8 శాతం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు.
అయితే మహిళా ప్రాతినిధ్యం విషయంలో రాజకీయ పార్టీలు తగినంత కృషి చేస్తున్నాయా అనేది ప్రశ్న. దేశం మొత్తంలో ఒక తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే 40 శాతం మహిళలను ఎంపీలుగా గెలిపించుకుంది. అలాగే గత 17 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 మంది మహిళలకు మంత్రి పదవులిచ్చింది. అయితే 2021 జూన్ వరకు ఎన్నికైన మహిళా నేతల విషయంలో మొత్తం 193 దేశాల్లో భారత్ 148వ స్థానంలో ఉంటూ కనిష్ట స్థాయిలో ఉండటం విచారకరం. ఎన్నికైన రాజకీయ ప్రతినిధులుగా మహిళల సంఖ్యను పెంచడానికి సంబంధించి ఇంకా చేయవలసింది ఎంతో ఉందని గుర్తించాలి.
బిల్లుపై వ్యతిరేకతకు కారణాలు ఇవా?
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే తోలుబొమ్మ అభ్యర్థులు, నకిలీ అభ్యర్థులు గెలవడానికి దారితీస్తుందంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు. భారతీయ జనాభాలో దాదాపు సగంమంది మహిళలే ఉంటున్నారు. కానీ మన కోసం మాట్లాడే మహిళా నేతలు ఇప్పటికీ తగినంతమంది లేరు. ఈరోజుల్లో ఇది ఎంతవరకు న్యాయం? ఇది సమర్థనీయమేనా, కనీసం ఆచరణాత్మకమైనదేనా? పైగా ఇప్పుడు చట్టసభల్లోనూ, అధికార స్థానాల్లో ఉన్న మహిళలు తమ సమర్థతను ఎంతగానో మెరుగుపర్చుకుంటున్నట్లు బలమైన ఆధారాలు కూడా ఉంటున్నాయి.
యూఎన్ విమెన్ సంస్థ దీనికి సమర్థనగా రెండు ఉదాహరణలు చూపించింది. భారత్‌లో, మహిళ నాయకత్వంలోని పంచాయతీల్లో నిర్వహిస్తున్న తాగునీటి ప్రాజెక్టులు, పురుషుల నాయకత్వంలోని పంచాయతీల్లో కంటే 62 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు పంచాయతీ రాజ్ సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌ని మహిళలకు కేటాయించడమే దీనికి కారణమని గుర్తించాలి. మరొక ఉదాహరణను నార్వేలో చూడవచ్చు. మునిసిపల్ కౌన్సిళ్లలో మహిళల ఉనికికి, శిశు సంరక్షణ కవరేజీకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆ దేశంలో కనుగొన్నారు. మహిళలు నిజంగానే పాలనను, నాయకత్వాన్ని పరివర్తన చెందించగలరు. ఒక మహిళగా నాకు ఈ విషయం ముందుగానే తెలుసు కానీ, మహిళలంటే ద్వేషించే, బద్ధవ్యతిరేకత ప్రదర్శించే వారికోసమే ఈ రెండు ఉదాహరణలను ఇక్కడ చూపిస్తున్నాను.
– సుథపా పాల్
రచయిత్రి, మీడియా ఎంట్రప్రెన్యూర్
(మిలీనియం సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment