![Sakshi Editorial On Parliament Monsoon Session](/styles/webp/s3/article_images/2021/07/16/Parliament-Bhavan.jpg.webp?itok=cEICKydP)
ప్రజలెన్నుకున్న ప్రతినిధులు పార్లమెంట్ సాక్షిగా తమ గళం విప్పి, స్వరం వినిపించే అవకాశం మరోసారి వచ్చింది. సోమవారం నుంచి మొదలయ్యే 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ 19 నుంచి ఆగస్టు 13 దాకా జరగనున్న ఈ సమావేశాలలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి సర్కారు సిద్ధమవుతుంటే, ప్రజా సమస్యలపై నిలదీయడానికి ప్రతిపక్షం ఆయుధాలకు పదును పెట్టుకుంటోంది. కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో, వ్యాక్సిన్ల విధానంలో పలు విమర్శలెదుర్కొన్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు తయారవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరుకుల ధరలు, సెంచరీ మార్కు దాటేసిన పెట్రోల్ ధరలు, కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం, ప్రజారోగ్య సమస్యలు, అలాగే దేశ సరిహద్దు భద్రత అంశం- ఇలా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు చాలా ఉన్నాయి. మరోపక్క అధికార పక్షం సైతం రకరకాల బిల్లులతో ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశాలు వేడిగా, వాడిగా జరిగేలా ఉన్నాయి.
కరోనా థర్డ్‌వేవ్ భయాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చిన తొలి సమావేశాలు ఇవే. అలా పలువురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించాక సభలో ప్రతిపక్షాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలూ ఇవే. అలా వీటికి ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం తన అజెండాను ముందుకు తీసుకురావాలనీ, ప్రతిపక్షాలు తమ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనీ ప్రయత్నించే వేళ... మొత్తం 19 రోజులు పార్లమెంట్ సమావేశం కానుంది.
నిజానికి, గత ఏడాది కరోనా మహమ్మారి దేశం మీద పడినప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలపై ఆ ప్రభావం గణనీయంగా పడింది. గత ఏడాది బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాల మొదలు ఈ ఏటి బడ్జెట్ సమావేశాల దాకా మూడింటినీ నిర్ణీత వ్యవధి కన్నా ముందుగానే ముగించాల్సి వచ్చింది. నిరుటి శీతకాల సమావేశాలనైతే ప్రజారోగ్య సంక్షోభం రీత్యా అసలు జరపనే లేదు. అయితే, టీకాలు అందుబాటులోకి రావడం, ఎంపీలు, పార్లమెంట్ ఉభయసభల సిబ్బందిలో ఎక్కువ మంది టీకాలు వేయించుకోవడంతో ఈ తాజా వానాకాల సమావేశాలు మునుపటి కన్నా కాస్తంత దీర్ఘంగానే జరగవచ్చు. పని కొంత ముందుకూ సాగవచ్చు.
ఈసారి అనేక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇప్పటికే 38 దాకా బిల్లులు, 5 ఆర్డినెన్స్‌లు పార్లమెంట్ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లుల్లో 17 కొత్తవి. వీటిని సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. దివాళా నియమావళిలో కొన్ని మార్పులు, డిపాజిట్ బీమా బిల్లు లాంటివి అనేకం వాటిలో ఉన్నాయి. 2008 నాటి ‘లిమిటెడ్ లయబులిటీ పార్టనర్‌షిప్’ (ఎల్‌ఎల్‌పీ) చట్టానికి కీలక సవరణను సైతం ప్రభుత్వం చేపట్టనుంది. విద్యుచ్ఛక్తి బిల్లు కూడా చర్చకు రానుంది.
అయితే, క్రిప్టో కరెన్సీ - అధికారిక డిజిటల్ కరెన్సీకి సంబంధించిన మరో కీలక బిల్లు మాత్రం ఈ సమావేశాల్లో కూడా సభ ముందుకు రావడం లేదన్నది గమనార్హం. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలన్నిటినీ నిషేధించి, అధికారిక డిజిటల్ కరెన్సీ ఆరంభానికి సంబంధించిన విధివిధానాలను అందించడం ఆ బిల్లు లక్ష్యం. నిజానికి ఈ ఏటి బడ్జెట్ సమావేశాలకే ఆ బిల్లును లిస్టులో పెట్టారు. కరోనాతో సమావేశాలను కుదించడంతో అది రాకుండానే సమావేశాలు ముగిశాయి. ఆ బిల్లు పరిధినీ, పరిమితులనూ ప్రభుత్వం ఇంకా ఖరారు చేయాల్సి ఉండడంతో ఈసారీ అది ఆగినట్టు వార్త. ఇక, సెన్సార్ వివాదాల విషయంలో సినీవర్గం ఆశ్రయించే సెన్సార్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సహా అనేక ట్రిబ్యు నళ్ళను ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు కూడా ఈసారి సభలో రానుంది. తల్లితండ్రుల, వృద్ధుల జీవనభృతి - సంక్షేమానికి సంబంధించిన సవరణ కూడా సర్కారు సభ ముందుకు తేనుంది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా నాలుగు రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతం పుదు చ్చేరీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రజల్లో పెరిగిన బలంతో, నైతికంగా రెట్టించిన ఉత్సాహంతో, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబం ధించి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం, ఇప్పటికీ అమలు కాని రాష్ట్ర విభజన హామీల లాంటివి పార్లమెంటులో ప్రస్తావనకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. వాటికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం, సంజాయిషీ ఇస్తుందో చూడాలి.
ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ఏ చట్టసభ సమావేశాలకైనా అర్థం, పరమార్థం. ప్రభుత్వం తాము చేపడుతున్న చర్యలను వివరించాల్సిందే. అదే సమయంలో క్షేత్రస్థాయిలోని లోటుపాట్లను ప్రతి పక్షాలు ఎత్తిచూపాల్సిందే. పరస్పరం సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ప్రజాకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య విలువైన సభాసమయం వృథా అయితేనే సమస్య. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కేవలం పాలకపక్షం మెరుపులకూ, ప్రతిపక్షాల ఉరుములకే పరిమితం కాకుండా ప్రజాసమస్యల పరిష్కార వేదిక కావాలన్నదే ఆకాంక్ష. సభ అలా సాగితే, ప్రజాస్వామ్యంలో అంతకన్నా కావాల్సింది ఏముంది!
Comments
Please login to add a commentAdd a comment