భిన్నాభిప్రాయాలే పార్లమెంటుకు జీవం
న్యూజిలాండ్‌లో రాష్ట్రపతి ప్రణబ్
ఆక్లాండ్: భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకుంటే పార్లమెంటు వ్యవస్థే పనిచేయదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. చట్టసభలో తీవ్రస్థాయిలో జరిగే వాదోపవాదాలు, చర్చల వల్ల ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతామన్నారు. ‘భారత్-న్యూజిలాండ్ బిజినెస్ కౌన్సిల్’ ప్రతినిధులనుద్దేశించి ఆదివారమిక్కడ ప్రణబ్ ప్రసంగించారు. ‘భారత పార్లమెంటు సభ్యులు భిన్న పార్టీలవారు. ఇది నిజమైన బహుళ పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్థ. తీవ్రస్థాయిలో జరిగే వాడి వేడి చర్చల అనంతరం నిర్ణయాలు తీసుకొంటాం. గోల చేస్తున్నారని అప్పుడప్పుడూ సహచరులను నవ్వుతూ అంటుంటా. కానీ, సంభాషణ, వాదన, చర్చ.. క్రమంలో అసమ్మతి అన్నది పార్లమెంటులో తప్పనిసరి’ అని అన్నారు.
విమాన సర్వీసుల ఒప్పందం
అంతకముందు రాష్ట్రపతి సమక్షంలో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య నేరుగా తిరిగే విమాన సర్వీసులకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.