పార్లమెంట్ పాతదైపోయింది. హాల్స్ నుంచి ప్రతీది.. ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగణంగా సరిపోవడం లేదు. పైగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భవిష్యత్ కోసం కొత్తది కావాల్సిందే.. నరంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇలాంటి ప్రకటనే చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి.. భారీ వ్యయంతో పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మించింది కూడా. రేపు(ఆదివారం) పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ తరుణంలో ఆధునిక భారత దేశ చరిత్రలో కీలక ఘట్టాలకు ఏకైక ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పార్లమెంట్ ప్రస్థానాన్ని తిరగేద్దాం..
కౌన్సిల్ హౌజ్ నుంచి పార్లమెంట్ అనే గుర్తింపు దాకా.. బ్రిటిషర్ల కాలంలో చట్ట సభల ద్వారా మొదలై.. 76 ఏళ్ల ప్రజాసామ్య దేశానికి సంబంధించి మొదటి మీటింగ్ జరిగింది ఈ భవనంలోనే!. ఉభయ సభల్లోని సభ్యుల మధ్య వాదప్రతివాదనలు, చర్చలు, నేతల కీలక ప్రసంగాలు, ప్రభుత్వాల పని తీరుపై ఓటింగ్‌లు.. ఇలాంటి ఎన్నో ఘట్టాల ద్వారా అనుబంధాన్ని అల్లేసుకుంది. దాని చరిత్రను పరిశీలిస్తే..
👉 1911లో కోల్‌కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అందుకోసం న్యూఢిల్లీని నిర్మించాలనుకుంది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీ ప్రణాళికా దశకి చేరింది. ఆ సమయంలో తక్కువ సభ్యులున్న లెజిస్టేటివ్ కౌన్సిల్ కోసం గవర్నర్ జనరల్ నివాసం (ఇప్పుడున్న రాష్ట్రపతి భవన్) సరిపోతుంది కదా అని బ్రిటిష్ అధికారులు భావించారు. వేసవిలో సిమ్లాలోని వైస్రాయ్ లాడ్జ్‌లో, శీతాకాలంలో అప్పటి ఢిల్లీ సెక్రటేరియెట్ బిల్డింగ్‌లో (ఇప్పుడది ఢిల్లీ అసెంబ్లీగా ఉంది) భేటీ అయ్యేవాళ్లు. అయితే..
👉 1918లో మాంటెగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు తెర మీదకు వచ్చాయి. దాని ప్రకారం.. చట్టసభల ప్రాధాన్యంతో పాటు... సభ్యుల సంఖ్యా పెరిగింది. ఎగువ, దిగువ సభలనేవి అమల్లోకి వచ్చాయి. వీటితో పాటు సిబ్బంది సంఖ్యా పెరిగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది. ఒకటి.. టెంట్ల కింద సభను నిర్వహించటం. రెండవది.. శాశ్వత భవంతిని నిర్మించడం. అలా.. 1921లో పార్లమెంట్ భవనానికి తొలి అడుగు పడింది. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ) తొలి భవంతి.
👉 న్యూ ఢిల్లీ నగర రూపశిల్పులు.. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటెన్, హెర్బర్ట్ బేకర్‌లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలను ప్రతిపాదించారు. ల్యూటన్ గుండ్రంగా, బేకర్ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్ దానికే బ్రిటిష్ సర్కారు మొగ్గు చూపింది.
👉 1921 ఫిబ్రవరి 12న.. డ్యూక్ ఆఫ్ కానాట్ ‘ప్రిన్స్ ఆర్థర్’ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో నిర్మితమైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో.. 27 అడుగుల ఎత్తైన పిల్లర్లు 144 ను ఉపయోగించి.. ఈ అందమైన భవంతి నిర్మించారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా పక్కా ప్లాన్‌తో చాలా బలంగా ఈ నిర్మాణం జరిగింది. బహుశా అందుకేనేమో ఈ 96 ఏళ్ల కాలంలో.. పార్లమెంట్ భవనానికి జరిగిన రిపేర్ సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి.
👉 మధ్యలో సెంట్రల్ హాల్, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు... చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. సెంట్రల్ హాల్ చుట్టూ ఉండే ఒక ఛాంబర్‌లో సంస్థానాధీశుల సభ (ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్), మరోదాంట్లో స్టేట్ కౌన్సిల్ (ఎగువ సభ, ప్రస్తుత రాజ్యసభ), మూడోదాంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ, ప్రస్తుత లోక్‌సభ) ఉండేవి.
👉 మధ్యప్రదేశ్‌లోని చౌసత్ యోగిని దేవాలయాకృతి స్ఫూర్తితో పార్లమెంట్ భవనం నిర్మించారనే ఒక ప్రచారం కూడా నడుస్తుంటుంది. అలా మన పార్లమెంటు భవనం ప్రారంభం కాగా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది.
👉 బ్రిటిషర్ల కాలంలో చట్టసభగా కొనసాగిన ఈ భవనం.. అధికార మార్పిడికి వేదికైంది. అంతేకాదు.. కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటు కాంప్లెక్స్‌లోనే ఉండేది.
👉 స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయినా స్థలం సరిపోయేది కాదు.
👉 సెంట్రల్ హాల్‌లో మూడోదైన లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే 1929లో విప్లవకారుడు భగత్‌సింగ్, ఆయన సహచరుడు బతుకేశ్వర్ దత్‌లు బాంబు విసిరారు.
👉 2001లో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడి జరిగింది పార్లమెంట్ భవనంపై.
స్వతంత్ర భారతంలోని అత్యంత కీలక చట్టాలకు ఈ పార్లమెంట్ భవనమే ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీలాంటి చీకట్లతో పాటు స్వాత్రంత్య దినోత్సవ వేడుకల వెలుగుల్ని వీక్షించింది ఈ భవంతి. మహ మహా మేధావుల నేతృత్వంలో ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకే కాదు.. వివాదాలకు, నేతల వ్యక్తిగత విమర్శలకూ ఈ ప్రజాస్వామ్య సౌధం వేదికగా మారింది.
👉 నూతన భవన నిర్మాణంలో సుమారు 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు సాగాయి. సెంట్రల్ విస్టా వెబ్‌సైట్ ప్రకారం.. పాత పార్లమెంటు భవన నిర్మాణానికి అవసరమైన రాళ్లు, మార్బుల్స్ కోసమే రాళ్లు కొట్టేవాళ్లను, మేస్త్రీలను కలిపి 2,500 మందిదాకా అప్పట్లో నియమించారట.
👉 కార్యకలాపాలకు కొత్త పార్లమెంట్ భవనం ఉపయోగించినప్పటికీ.. పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చబోమని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. పాత పార్లమెంటు భవనాన్ని దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని తెలిపారు. ఆ అవసరం ఉంది కూడా.
👉 మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న టైంలో.. పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 ఏళ్ల నాటి భారతీయ విశిష్ట నాగరికత సంస్కృతులు ఇందులో అద్దంపట్టేలా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment