న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పంద వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన ఆరోపణలను రక్షణ మంత్రి నిర్మల తిప్పికొట్టారు. ఆ ఒప్పందం రహస్య సమాచార పరిధిలోకే వస్తుందని, రాఫెల్ ఒప్పంద వివరాలను బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. రహస్య సమాచార పరిరక్షణకు సంబంధించి ఫ్రాన్స్, భారత్‌ల మధ్య ఒక ఒప్పందం 2008లోనే కుదిరిందని గుర్తు చేశారు. రాఫెల్ ఒప్పందం ఆ పరిధిలోకే వస్తుందన్నారు. ‘ఇది గోప్యతా ఒప్పందం.
సున్నిత సమాచారాన్ని పరిరక్షించాల్సి ఉంది. రాహుల్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ, భారత చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్ మాట్లాడుతూ ఒప్పంద వాణిజ్య విషయాలు బహిర్గతం చేయకూడదని అన్నారు. రాహుల్ చెప్పినదంతా అబద్ధం’ అని నిర్మల తిప్పికొట్టారు. రాఫెల్ ఒప్పందంలో అసలు గోప్యతా నిబంధనలే లేవన్న రాహుల్ ఆరోపణలు నిరాధారమన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం రాహుల్ ఆరోపణలపై స్పందించింది.
రాఫెల్ విమానాల కొనుగోలు వివరాలను బహిర్గతం చేయడానికి తమకేం అభ్యంతరం లేదని మేక్రన్ తనకు చెప్పారని లోక్‌సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఫ్రెంచ్ ప్రభుత్వం తప్పుబట్టింది. ‘2008లో చేసుకున్న భద్రతా ఒప్పందానికి రెండు దేశాలు కట్టుబడి ఉండాల్సిందే. రక్షణ రంగంపై ప్రభావం చూపే అంశాలను రహస్యంగా ఉంచాలన్న నిబంధన ఆ ఒప్పందంలో ఉంది’ అని పేర్కొంది. సున్నితమైన అంశాలతో కూడిన ఒప్పందం వివరాలను భారత్, ఫ్రాన్స్‌లలో ఎక్కడా బహిర్గతం చేయొద్దని 2018 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతిని కూడా ఫ్రాన్స్ ఆ ప్రకటనలో గుర్తుచేసింది.
బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
రాహుల్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని బీజేపీ ఆరోపించింది. రాఫెల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంపై రక్షణమంత్రి అబద్ధాలు చెబుతున్నారంటూ లోక్‌సభలో రాహుల్ ఆరోపించడంతో బీజేపీ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పార్లమెంట్‌లో రాహుల్ పిల్లాడిలా ప్రవర్తించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాహుల్ అపరిపక్వతతో పిల్లాడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎదగకపోవటం దురదృష్టకరం. సభలో సభ్యుడిపై ఎవరైనా ఆరోపణలు చేయాలనుకుంటే ముందుగా స్పీకర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆరోపణలకు సమర్ధనగా ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా ఆయన నిరాధార ఆరోపణలు చేశారు’ అని అన్నారు. అనంతరం బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి రాహుల్‌పై సభాహక్కుల నోటీసు ఇచ్చారు.
రాఫెల్ ఒప్పందం నేపథ్యం
ఫ్రెంచి కంపెనీ డసాల్ట్ నుంచి 36 రాఫెల్ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ 2016 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58 వేల కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. గత యూపీఏ ప్రభుత్వం 126 విమానాలను కొనుగోలు చేయాలనుకున్నా, తరువాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆ సంఖ్యను 36కు తగ్గించింది. ఈ ఒప్పందం కింద డసాల్డ్.. భారత్‌కు చెందిన డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్ తదితర సంస్థలతో విమానాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఇంటర్ గవర్నమెంటల్ ఒప్పందాన్ని ‘రాఫెల్ డీల్’గా పేర్కొంటున్నారు. యూపీఏ సమయంలో కుదిరిన దాని కన్నా ఒక్కో విమానం ధర మూడు రెట్లు ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఒప్పందం వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment