సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ సభలో చదవి వినిపిస్తుండగా.. టీడీపీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు లేచి నిలబడి మద్దతు తెలిపారు. అవిశ్వాసానికి 50కి పైగా సభ్యుల మద్దతు లభించడంతో పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలపకపోవడం గమనార్హం. టీడీపీ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి టీఆర్‌ఎస్ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందస్తుగానే సంకేతమిచ్చారు.
పార్లమెంట్ నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా చర్చకు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే త్వరలో తేదీ ప్రకటిస్తామని స్పీకర్ తెలిపారు. అయితే ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18 పనిదినాల పాటే జరగనుండటంతో రెండు మూడు రోజుల్లో చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పాటు కాంగ్రెస్ అవిశ్వాస తీర్మాన నోటిసులిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, చర్చలో అన్ని విషయాలు వెల్లడిస్తామని, పార్లమెంట్ వ్యవహారాల శాక మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment