
జీవీఎల్ నరసింహారావు
సాక్షి, న్యూఢిల్లీ : పక్క రాష్ట్రం(తెలంగాణ) మద్ధతు కూడా కూడగట్టలేకపోయిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఏపీ, తెలంగాణాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ప్రత్యేక హోదాపై పదే పదే వైఖరి మార్చుకుంటున్న చంద్రబాబుకు ప్రతీ విషయంలోనూ యూటర్న్ తీసుకోవడం అలవాటైందని వ్యాఖ్యానించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆయన ఆరోపించారు. జనాలను మభ్యపెట్టి, మోసం చేయాలని చూస్తున్న చంద్రబాబు ప్రయత్నాలేవీ సఫలం కావన్నారు.
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు కాబట్టి టీడీపీ మాటలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని.. అసెంబ్లీలో మహానాడులో ప్రత్యేక ప్యాకేజీని కొనియాడారని గుర్తు చేశారు. ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారని, మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. టిడిపి ఇచ్చిన ఆరువందల హామీల అమలుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాటమార్చారని చిన్నపిల్లలకు కూడా అర్థమైందని ఎద్దేవా చేశారు.
‘రాహుల్ గాంధీ అసమర్థుడు..’
రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యమని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా వ్యవహరించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చే ఒక్క మాట కూడా మాట్లాడలేదని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అసమర్థుడని మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. కేవలం మోదీపై విద్వేషంతోనే విపక్షాలు ఒక్కటయ్యాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment