పనాజి : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, అనంతరం తన సీట్లో కూర్చుని కన్నుగీటడం వంటి చర్యల ద్వారా రాహుల్ సభా మర్యాదను మంటగలిపారని బీజేపీ నేతలు విరుచుకు పడిన విషయం తెలిసిందే. తాజాగా గోవా బీజేపీ అధికార ప్రతినిధి దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. భారత ప్రజల సమస్యలను, కష్టాలను అర్థం చేసుకోలేని వ్యక్తే ఇలా ప్రవర్తిస్తారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొలువుదీరిన పవిత్రమైన ఆలయం(పార్లమెంటు)లో రాహుల్ చేసిన పనులు చాలా అవమానకర రీతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలేజీల్లో, రోడ్లపై అమ్మాయిలను ఏడిపించే లోఫర్లే ఇలా కన్నుగీటుతారని, రాహుల్ కూడా సభలో ఓ లోఫర్ లాగే వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ కుటుంబం చేతుల్లో తోలుబొమ్మల్లా మారిన కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లు చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించారు. కాగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్.. బీజేపీ, మిత్ర పక్షాల చేతిలో తోలుబొమ్మగా మారడం వల్లే రాష్ట్రంలో ఫిష్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ నేత చోదంకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment