భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న మోదీ.
పణజి: క్లోమగ్రంథి కేన్సర్‌తో మృతిచెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అంత్యక్రియలు సోమవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు, పణాజి వచ్చిన ప్రధాని మోదీ పరీకర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆ తరువాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకుని పరామర్శించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరీకర్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. నూతన ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఆదివారం రాత్రే గోవా చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా పరీకర్‌కు చివరిసారి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. పరీకర్ పెద్ద కొడుకు ఉత్పల్ ఆయన చితికి నిప్పంటించారు.
తరలివచ్చిన అభిమానులు
పణజిలోని కళా అకాడమీ నుంచి దహనసంస్కారాలు నిర్వహించిన మీరామర్ బీచ్ వరకు సాగిన అంతిమయాత్రలో వేలాది మంది పరీకర్ మద్దతుదారులు, అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు, బీజేపీ కార్యాలయంలో ఉంచిన ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు సామాన్య ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అశేష సంఖ్యలో తరలివచ్చారు. త్రివర్ణ పతాకంలో చుట్టిన పరీకర్ పార్థివ దేహాన్ని చూడగానే ఆయన అభిమానలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రకు ముందు బీజేపీ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలు జనంతో రద్దీగా మారాయి. కళా అకాడమీ ముందు కూడా ప్రజలు మత విశ్వాసాలకు అతీతంగా బారులు తీరి పరీకర్‌కు నివాళులర్పించారు. ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పరీకర్ మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.
అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరీకర్ కొడుకు
గోవా కొత్త సీఎంపై ఉత్కంఠ!
రాత్రి 11 గంటలకు సీఎంగా ప్రమోద్ ప్రమాణం చేస్తారన్న బీజేపీ
అంతలోనే ఆ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటన
మిత్రపక్షాలతో ఇంకా చర్చలు సాగుతున్నాయని వెల్లడి
పణజి: గోవాకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కానున్నారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ సోమవారం రాత్రే 11 గంటలకు ప్రమాణంచేస్తారని బీజేపీ ప్రకటించింది. కొద్దిసేపటికే ప్రమాణస్వీకారాన్ని విరమించుకుంటున్నామని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున నుంచి కేంద్రమంత్రి గడ్కరీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు సంకీర్ణ ప్రభుత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)లతో చర్చలు జరిపారు. సీఎం ఎవరనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని గడ్కరీ చెప్పారు.
సోమవారం సాయంత్రం తర్వాత కొద్దిసేపటికే తదుపరి సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఎంపికయ్యారనీ, జీఎఫ్‌పీ చీఫ్ విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నామని బీజేపీ వెల్లడించింది. ఈ ఒప్పందానికి కూటమి పార్టీలు ఒప్పుకున్నందున రాత్రి 11 గంటలకు ప్రమోద్ చేత గవర్నర్ మృదులా సిన్హా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారంది. మళ్లీ ఏమైందోగానీ, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. మిత్రపక్షాలతో ఇంకా చర్చలు జరుగుతున్నందున రాత్రి 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండదని డిప్యూటీ స్పీకర్ మైఖేల్ ప్రకటించారు. అంతకుముందు సోమవారం తెల్లవారుజామున గోవాకు చేరుకున్న నితిన్ గడ్కరీ, కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు, ఎంజీపీ, జీఎఫ్‌పీ నేతలతోనూ చర్చించారు. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్లు 40 కాగా, 14 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది.
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గోవాకు నూతన ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించగా, మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం గోవా అసెంబ్లీలో తమదే అతిపెద్ద పార్టీ అయినందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ మృదులా సిన్హాను సోమవారం కోరారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావెల్కర్ నేతృత్వంలోని 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యల బృందం సోమవారం గవర్నర్‌ను కలిసింది. ఈ విషయంపై తర్వాత సంప్రదిస్తానని గవర్నర్ తమతో చెప్పారని చంద్రకాంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment