సాక్షి, న్యూఢిల్లీ : గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరపుతూ వచ్చింది. బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ గత రాత్రి 9 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, అందుకు ఆయనకు మెజారిటీ సభ్యుల బలం ఉందని ప్రకటన వెలువడింది. ఇంతలో తమకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ ఇంతకాలం బీజేపీ సీఎం మనోహర్ పర్రీకర్‌కు మద్దతిస్తూ వచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
దీంతో గోవా ప్రభుత్వంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు గవర్నర్‌ను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంతలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు వచ్చి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి, ఆ ఇద్దరితో బీజేపీ శాసన సభ్యుల సంఖ్య 12 నుంచి 14 చేరుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్యతో సమానం అవుతుంది. దాంతో మళ్లీ రాత్రి ఒంటి గంట వరకు మంతనాలు కొనసాగాయి.
గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లకుగాను మనోహర్ పర్రీకర్, అంతకుముందు ఓ బీజేపీ సభ్యుడి మృతి, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు బీజేపీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 36కు పడిపోయింది. కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి మూడు, గోవా ఫార్వర్డ్ బ్లాక్‌కు మూడు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఒక్క ఎన్‌సీపీ సభ్యుడు ఉన్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ త్వరగా పావులు కదిపి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు ముగ్గురు స్వతంత్య్ర సభ్యుల మద్దతును సేకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్‌ను బీజేపీ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది.
మారిన పరిస్థితుల్లో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బీజేపీ రెండు మిత్రపక్షాలు డిమాండ్ చేయడంతో గోవాలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడుతుందని, ఖాళీగా ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వరకు అసెంబ్లీని సుషుప్త చేతనావస్థలో ఉంచాల్సి వస్తుందని ఊహాగానాలు చెలరేగాయి. చివరకు ఆ రెండు పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులకు అంగీకరించడంతో సంధి కుదిరింది. దాంతో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ సీఎంగా ప్రమాణం చేయగా, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అతి చిన్న రాష్ట్రమైన గోవాకు ఇద్దరు డిప్యూటి ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. తుది లెక్కల ప్రకారం మిత్రపక్షాలను కలుపుకొని అసెంబ్లీలో బీజేపీ బలం 21కి చేరుకోగా, ఎన్సీపీ సభ్యుడిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలం15 వద్ద స్థిరంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment