మనోహర్ పరీకర్
సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే ఆయన ఎలాంటి జబ్బుతో బాధ పడుతున్నారో వెల్లడించలేదు. వైద్య చికిత్స కోసం ఆయన ఆరు వారాలపాటు అమెరికాలో ఉంటారని అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఆయన గైర్హాజరీలో ఆయన తరఫున సీఎం బాధ్యతలను మనోహర్ పరీకర్ ఎవరికీ అప్పగించలేదు. ఆయన ముఖ్యమంత్రి సహా దాదాపు 20 కేబినెట్ శాఖలను ఆయనే నిర్వహిస్తున్నారు.
తన ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా తానే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను నిర్వహిస్తానంటూ మనోహర్ పరీకర్ అమెరికా వెళ్లే ముందు రాష్ట్ర గవర్నర్ మధుల సిన్హాకు ఓ లేఖను అందజేసి వెళ్లారు. తాను నిర్వహిస్తున్న హోం, ఆర్థిక, సాధారణ పరిపాలన వ్యవహారాలు తదితర శాఖల సమావేశాలను ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహిస్తానని, అది సాధ్యంకాని సందర్భాల్లో తాను ప్రతిపాదించిన వ్యక్తి సమావేశాలను నిర్వహిస్తారని ఆ లేఖలో పరీకర్ స్పష్టం చేశారు. ఆయన అమెరికా బయల్దేరి వెళ్లే ముందు ఓ ముగ్గురు సభ్యులతో కలిసి ఓ కేబినెట్ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. కీలక సమయాల్లో మాత్రం ముఖ్యమంత్రినే తుది నిర్ణయం తీసుకుంటారు.
గోవాలో సంకీర్ణ ప్రభుత్వం ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీ నుంచి ఫ్రాన్సిస్ డిసౌజా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నుంచి రామకష్ణ సుధీన్, గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి విజయ్ సర్దేశాయ్‌లను సలహా సంఘంలోకి తీసుకున్నారు. అయితే రాజ్యాంగం నిబంధనల ప్రకారం కే బినెట్‌కు సలహా సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కులే దని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. పరీకర్ తన కేబినెట్ మంత్రులపై నమ్మకం లేకపోవడం వల్లనా లేదా సమర్థులైన వ్యక్తులు లేనందున సీఎం బాధ్యతలు ఇతరులకు అప్పగించడం లేదని ప్రశ్నించగా, సమర్థులైన నాయకులు లేకనే అని సమాధానం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లకుగాను కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు రాగా, బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు జరుగకుండా ఉండేందుకు పరీకర్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment