సాక్షి, న్యూ ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు బలనిరూపణకు పావులు కదుపుతున్నాయి. అటు అధికార పార్టీ కూడా అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని ధీమాగా ఉంది. ఈ క్రమంలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అవిశ్వాసం గెలవడానికి అవసరమైన సంఖ్యా బలం తమకు ఉందని, బీజేపీయేతర శక్తులను కలపుకొని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
సోనియా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందించారు. సోనియాజీ.. పాపం మ్యాథ్స్‌లో పూర్ అనుకుంటా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందుగా వారి పార్టీ ఎంపీల సంఖ్య ఎంతో చూసుకోండని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వానికి ఇంటా బయట స్పష్టమైన మద్దతుందని తెలిపారు. శివసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామేనని ఓ ప్రశ్నకి సమాధానంగా తెలిపారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం 313 ఉండటంతో అవిశ్వాసంలో తమదే గెలుపని అనంతకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల తర్వాత తొలిసారి అవిశ్వాసంపై చర్చ జరగనుంది. చివరిసారిగా 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను వీలైనన్ని ఆమోదించుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు 68 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కనీసం 25 బిల్లులకైనా ఆమోద్రముద్ర లభించే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రతిపక్షాలు కూడా మోదీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలనే ఉద్దేశంతో ఉంది. దళితులపై దాడులు, మహిళల రక్షణ, రైతు సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment