సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో పాలక నరేంద్ర మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. బీజేపీతో కేంద్రంలో, మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన పలు సందర్భాల్లో బీజేపీని ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో తాము విడిగా పోటీచేస్తామని శివసేన ప్రకటించింది. అయితే విపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రభుత్వానికి బాసటగా నిలవాలని అమిత్ షా ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరేను కోరినట్టు సమాచారం.
అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేసే సంఖ్యాబలం బీజేపీకి ఉన్నా మిత్ర పక్షాలను విపక్షానికి సహకరించే పరిస్థితి తీసుకురాకూడదని కమలనాధులు భావిస్తున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలా అనే దానిపై పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శివసేన వైఖరి ఏంటో లోక్‌సభలో శుక్రవారం మాత్రమే అందరికీ తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment