న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో వాతావరణం గందరగోళంగా మారింది. లోక్‌సభలో విశ్వాస పరీక్ష, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై పలు రాజకీయ పక్షాల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. అయితే ఈ గందరగోళంలోనూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. స్పీకర్ క్వశ్చన్ అవర్‌ను ప్రారంభించగానే తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సహాపలు పార్టీల సభ్యులు వివిధ అంశాలపై నినాదాలు చేశారు. ఎన్డీయే మాజీ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు ‘వి వాంట్ జస్టిస్’ అని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఎస్పీ నేతలు కూడా వెల్‌లోకి దూసుకొచ్చి పలు డిమాండ్లతో నినదిం చారు. కాంగ్రెస్ ఎంపీలు తమ తమ స్థలాల్లోనే వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేశారు.
కొత్త సభ్యుల ప్రమాణం
సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభకు చేరుకుని అధికార, విపక్ష సభ్యులందరికీ అభివాదం చేశారు. సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయానికి ముందే.. కొత్తగా ఎన్నికైన ఎంపీలు కుకాడే యశ్వంత్ రావ్ (ఎన్సీపీ), గవిట్ రాజేంద్ర (బీజేపీ), తోఖేహో (ఎన్‌డీపీపీ), తబస్సుమ్ బేగమ్ (ఆర్‌ఎల్‌డీ) ప్రమాణం చేశారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చబోం
అటు, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల్లో ఆందోళన నెలకొందని సీపీఐ సభ్యుడు డి.రాజా పేర్కొన్నారు. దీనికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని.. ఇందుకోసం సంబంధిత చట్టాలకు సవరణలు జరుపుతున్నామన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకుండే హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోం. ఏ సంస్థ అయినా వ్యక్తులైనా ఈ హక్కులను కాలరాస్తే ఊరుకోం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సభకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 30 రాష్ట్రాల్లో 24 ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయనున్నట్లు మరో మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ ఆహిర్ వెల్లడించారు.
మానవ అక్రమరవాణా నిరోధక బిల్లు
దేశ తొలి సమగ్ర మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును కేంద్ర మంత్రి మేనకా గాంధీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ నేరాన్ని నిరోధించడంతో పాటు బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. చాకిరి, భిక్షాటన, వివాహాల్ని కూడా దీని పరిధిలో చేర్చారు.
ఆర్థిక నేరగాళ్ల బిల్లు కూడా..: ఆర్థిక నేరాలకు పాల్పడి, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించే బిల్లును ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
తొలిరోజే రచ్చ
Published Thu, Jul 19 2018 2:12 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment