సాక్షి, న్యూఢిల్లీ : మళ్లీ మళ్లీ అవే దృశ్యాలు. అవే సన్నివేశాలు. సభ్యుల నుంచి అదే తీరు. స్పీకర్ నుంచి అవే మాటలు. వెరసి మంగళవారం కూడా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగలేదు. అసలు పార్లమెంటు సమావేశాలే ముందుకుసాగలేదు. మంగళవారం ఉదయం ఇలా ప్రారంభమై.. ఆ వెంటనే అలా మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదాపడిన లోక్‌సభ.. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన ఎక్కువసేపు ఏమీ కార్యకలాపాలు జరగలేదు. ఎప్పటిలాగే అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి వెళ్లి.. నినాదాలతో హోరెత్తించారు. కావేరీ జలాల విషయమై అన్నాడీఎంకే సభ్యులు లోక్‌సభను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే.
అన్నాడీఎంకే సభ్యుల ఆందోళన కొనసాగుతున్నా.. ఆ గందరగోళం నడుమ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం గురించి ప్రకటన చేశారు. ఈ చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఆయన ప్రకటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై చర్చ చేపట్టాలని ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం తారస్థాయికి చేరింది. ఈ గందరగోళం నడుమ స్పీకర్ సుమిత్రా మహాజన్.. కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నోటీసు అందిందని, ప్రతిపక్ష సభ్యులు సహకరిస్తే.. అవిశ్వాసానికి మద్దతుగా నిలబడిన ఎంపీలను లెక్కిస్తానని ఆమె పదేపదే చెప్పారు. అయినా, ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులు వినిపించుకోలేదు. ఈ గందరగోళం నడుమ సభ ఆర్డర్‌లో లేనందున అవిశ్వాసం చేపట్టడం లేదంటూ.. ఎప్పటిలాగే లోక్‌సభను స్పీకర్ మహాజన్ బుధవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో కొత్త ఎంపీల ప్రమాణం
రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), మనోజ్‌కుమార్ ఝా (ఆర్జేడీ), సీఎం రమేశ్ (టీడీపీ) ప్రమాణం స్వీకరించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో పెద్దల సభ కూడా బుధవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment