సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో పరిస్థితి మారలేదు. సభ తీరు మారలేదు. సభ్యుల ధోరణీ మారలేదు. సభాపతి మాటలూ మారలేదు. దీంతో సోమవారం ప్రారంభమైన క్షణాల్లోనే లోక్‌సభ వాయిదా పడింది. ఎప్పటిలాగే లోక్‌సభ ప్రారంభం కాగానే.. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. కావేరీ జలాల విషయంలో వెల్‌లోకి దూసుకెళ్లి తమ శక్తిమేర నినాదాలు చేశారు. సభలో గందరగోళం.. స్పీకర్ సుమిత్రా మహాజన్ పరిస్థితిని చూశారు. వారించారు. సభ్యులు వినలేదు. అంతే క్షణాల్లో స్పీకర్ లోక్‌సభను మధ్నాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు.
మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి లోక్‌సభ ప్రారంభమైనా పరిస్థితి మారలేదు. అన్నాడీఎంకే సభ్యులు యథావిధిగా వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. తమ అరుపులు, కేకలు, నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళంలోనే కేంద్రమంత్రులు తమ బిల్లులు, పత్రాలను ప్రవేశపెట్టేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఇతర సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్ చదివి వినిపించారు. అవిశ్వాసంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సభ ఆర్డర్‌లో లేకపోతే.. అవిశ్వాసంపై చర్చ జరపడం కుదరని, చర్చకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి అనంత్‌కుమార్ మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చ జరపడమే కాదు చర్చకు సమాధానం కూడా ఇస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇటు అన్నాడీఎంకే సభ్యులు మాత్రం వెనుకకు తగ్గలేదు. నినదాలతో సభలో గందరగోళం రేపారు. దీంతో సభ్యులను పదేపదే వారించేందుకు ప్రయత్నించిన స్పీకర్ మహాజన్.. ఎప్పటిలాగే అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండానే మంగళవారానికి లోక్‌సభను వాయిదా వేశారు.
అటు పెద్దల సభలో పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏమీలేదు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు పొడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. చైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులను వారించే ప్రయత్నం చేశారు. ఇలా నిరసన తెలుపడం వల్ల మీరే సాధించేదేమీ ఉండదు. ప్రజలు చూస్తున్నారని చెప్పి చూశారు. సభ్యులు వినిపించుకోలేదు. ఆందోళన కొనసాగింది. సభాపతి ఏకంగా మంగళవారం ఉయదం 11 గంటలకు రాజ్యసభ వాయిదా వేసి వెళ్లిపోయారు.
మరోసారి అవిశ్వాసం నోటీసులు
ఏపీకి అపర సంజీవని వంటి ప్రత్యేకహోదాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. విభజన హామీలను నెరవేర్చలేదు. ఇందుకు నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా తొమ్మిదోసారి కేంద్రంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చింది. అయినా సోమవారం కూడా లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరగలేదు. దీంతో లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment