సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఆరో రోజు కూడా చర్చకు రాలేదు. వాయిదా అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన సభలో నినాదాలు మిన్నంటడంతో అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో ప్రవేశపెట్టలేకపోతున్నానని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సభ ఆర్డర్‌లో లేని కారణంగా మంగళవారానికి వాయిదావేశారు. దీంతో లోక్‌సభ కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ మరోసారి అవిశ్వాసంపై నోటీసులు అందజేసింది.
అంతా ఒకదగ్గరికొస్తే లెక్కపెడతాం: వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహంలు అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చారన్న స్పీకర్.. ‘‘సభ సజావుగా సాగినప్పుడు మాత్రమే దానిపై ముందుకు వెళతానని స్పష్టం చేస్తున్నా.. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే ఎంపీలంతా ఒకచోటి వస్తే లెక్కింపునకు సులువుగా ఉంటుంది. ఇదంతా జరగాలంటే ఆందోళన చేస్తోన్న ఎంపీలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలి..’ అని అన్నారు. వెల్‌లో ఆందోళన చేస్తోన్న టీఆర్‌ఎస్, ఐఏడీఏంకే ఎంపీలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు.
7వ వేతన సంఘంపై కమిటీ ఏర్పాటు: ఏడవ వేతన సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల పరిశీలన కోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా తెలిపారు. మురళీ మనోహర్ జోషి అధ్యక్షుడిగా ఉండే కమిటీలో ఆర్థిక మంత్రి, వివిధ స్థాయీ సంఘాల అధ్యక్షులు సభ్యులుగా ఉంటారని, సమగ్ర పరిశీలన అనంతరం సదరు కమిటీ లోక్‌సభ, రాజ్యసభలకు సూచనలు చేస్తుందని పేర్కొన్నారు. ఎంపీల నినాదాల నడమే స్పీకర్ ఈ మేరకు ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment