
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్‌సీపీ సహా ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ముందుకు రాకుండానే లోక్‌సభ వాయిదా పడింది. కావేరి నదీజలాల వివాదంపై అన్నాడీఎంకే ఎంపీలు నిరసనలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. మంగళవారం 11 గంటలకు సభ ప్రారంభమైన మరుక్షణం నుంచే ఏఐఏడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు.
రాజ్యసభ కూడా: పలు అంశాలపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పెద్దల సభలోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11 గంటలకే సభ ప్రారంభంకాగా.. విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను 15 నిమిషాలపాటు వాయిదావేశారు. అనంతరం సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాకపోవడం రాజ్యసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.