సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ హక్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసులు తనకు అందాయని చెప్పారు. ఈ మేరకు నోటీసులను ఆమె చదివి వినిపించారు కూడా.
‘‘లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు నాకు అందాయి. హౌజ్ అదుపులోకి వస్తే దానిపై చర్చ చేపడతాను..’’ అని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. ఆ సమయంలో కొన్ని పక్షాలు వేర్వేరు డిమాండ్లతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంతో ఆమె సభను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ సోమవారం మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ఎంపీలు తెలిపారు.
సభ అదుపులో ఉంటేనే అవిశ్వాసం చర్చ సాధ్యం..
రాజ్యాంగంలోని 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. దానిపై నమ్మకం కోల్పోయామని భావించినప్పుడు ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మాన కోసం నోటీసు ఇవ్వొచ్చు. లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు అవిశ్వాస తీర్మానం కోసం నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఇస్తారు. ఈ తీర్మానాన్ని సభలో చర్చకు చేపట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. నోటీసును స్పీకర్ పరిశీలించాక.. సభ్యుల మద్దతుందని సభ్యుడు చెప్పిన తర్వాత.. ఆ 50 మంది లేచి నిలబడాలి. స్పీకర్ సంతృప్తి చెందితే.. చర్చకు స్వీకరిస్తారు. నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలంటే ఆ రోజు సభ క్రమపద్ధతిలో ఉండాలి. లేకుంటే తరువాతి రోజుకు ఆ సభ్యుడు మరోసారి నోటీసివ్వాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ చర్చకు చేపడితే.. అది ముగిశాక ఓటింగ్ నిర్వహిస్తారు. తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment