
సాక్షి, అమరావతి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్.. ‘ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే’ అంటూ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ – బీజేపీలు ఇంకా కలిసే ఉన్నాయని స్పష్టమవుతోందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. రెండు పార్టీలూ కలిసి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయనిపిస్తోందని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో హోదా డిమాండ్‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అత్యంత పేలవమైన, బలహీనమైన వాదనలు వినిపించిందని దుయ్యబట్టారు.
చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మూడున్నరేళ్లుగా ప్రత్యేక హోదా అంశానికి తూట్లు పొడిచి.. ఇప్పుడు అవిశ్వాసంపై జరిగిన చర్చలో వ్యర్థమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు కేంద్రం చేస్తున్న వంచన తెలియడానికే ఇన్నేళ్లు పట్టిందంటే నమ్మాలా.. అని ప్రశ్నించారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న మీరు మాత్రం.. ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లలాగా ‘కేంద్రం మోసగించింది’ అంటే జనం నమ్ముతారా.. అని ధ్వజమెత్తారు.
హోదా అడిగిన వారిని తిడుతూ.. ప్యాకేజీ ఇస్తామన్న బీజేపీ నాయకులకు సన్మానాలు చేసిన వారికి.. మోసం తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందా.. అని పవన్ విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రతి దశలోనూ బీజేపీ నాయకత్వంతో టీడీపీ కుమ్మక్కై రాజీ పడుతూ వచ్చిందని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదా డిమాండ్‌నే తాకట్టు పెట్టిన టీడీపీ.. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు అన్యాయం చేయవద్దని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.
నేడు, రేపు విజయవాడలో పవన్‌కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ శని, ఆదివారాల్లో విజయవాడలో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుంటారని, ఆదివారం రాజధాని ప్రాంత రైతులతో భేటీ అవుతారని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment