ప్రహసనంగా ముగిసిన అవిశ్వాసం! | Article By Varayogi On No Confidence Motion In Sakshi | Sakshi

Jul 24 2018 2:15 AM | Updated on Oct 17 2018 6:18 PM

Article By Varayogi On No Confidence Motion In Sakshi

పార్లమెంటులో ఏమీ సాధించే అవకాశం లేకపోయినా గొప్పలకు పోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్లయింది. దేశం ముందు, రాష్ట్ర ప్రజల ముందు బీజేపీని అభాసుపాలు చేయాలనుకున్న టీడీపీకీ, చంద్రబాబుకీ ఎదురుదెబ్బలు మిగిలాయనడంలో సందేహం లేదు. తమ వెంట కొత్తగా వచ్చేవారెవరూ లేరని దేశప్రజలకు పార్లమెంట్‌ సాక్షిగా తెలియజేసినట్లయిందనడానికి నిదర్శనం అవిశ్వాసానికి అనుకూలంగా వచ్చిన కేవలం 126 మంది మద్దతే. అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ముందు, పార్లమెంటులో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అవి శ్వాసంపై చర్చకు అనుమతించిన తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్‌ తదితర వారి మిత్రపక్షాల పెద్దలు మాట్లాడిన మాటలు కోటలు దాటాయి. కానీ వారిమాటలకు తగినట్లుగా కూడా వారు సిద్ధం కాకపోవడం స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే ప్రధాని నరేంద్రమోదీ కూడా తన ప్రసంగంలో వారి తీరును ఎద్దేవా చేశారు. భూకంపం సృష్టిస్తాం అన్నారు.. ఏదీ భూకంపం? అవిశ్వా సంపై చర్చలో మాట్లాడడానికి కనీసం ముందస్తుగా సిద్ధమై రాలేదు అని మోదీ ఎత్తిపొడిచారు. 

ఇక టీడీపీ తరఫున అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన గల్లా జయదేవ్‌ మాటల్లో కూడా కొత్తదనం కనిపించలేదు. ముందుగా నిర్ణయించిన సమ యం కన్నా రెట్టింపుకుపైగా సమయాన్ని స్పీకర్‌ అనుమతించినా ప్రయోజనం లేకపోయింది. మోదీని వ్యక్తిగతంగానూ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే పార్లమెంటులో టీడీపీ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినట్లయింద. కేంద్రంపై టీడీపీ విమర్శలన్నీ తెలుగు ప్రజలు నిత్యం అరిగిపోయిన రికార్డుల్లా వింటున్నవే కావడం గమనార్హం. అందుకే జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీ వైఖరిని ట్వీట్లతో తూర్పారబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసమే టీడీపీ నేతలు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడ్డారని విమర్శించారు. ఇక రాష్ట్రానికే చెందిన బీజేపీ సభ్యుడు హరిబాబు తెలుగుదేశం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. నిబంధనల ప్రకారం టీడీపీ ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌–ఎస్‌పీవీ–ని ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. అందుకే కేంద్రం ఏపీకి మరింత సహాయం చేయలేకపోతోందని ఎత్తిచూపారు. 

చర్చను కొనసాగిస్తూ జయదేవ్‌ మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ టీడీపీ సహించలేకపోతున్నట్లు అనిపించింది. అందుకే పార్లమెంటులో టీఆరెస్‌ సభ్యులు గల్లా జయదేవ్‌ మాట్లాడే సమయంలో తీవ్ర నిరసన తెలిపారు. కేంద్రం తెలంగాణకు పూర్తిగా న్యాయం చేస్తూ, ఆంధ్రకు అన్యాయం చేస్తోందనటం సబబు కాదు. తమకు కావలసింది అడగడంలో తప్పు లేదు కానీ, తెలం గాణ విషయంలో టీడీపీ అక్కసు వెళ్లగక్కడం సమంజసం కాదు. తెలంగాణ విషయాన్ని లేవనెత్తడం ద్వారా టీడీపీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందన్న విషయాన్ని కూడా సుదీర్ఘ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఎలా మరిచిపోయారు. అందుకే ప్రతి విషయంలోనూ తెలంగాణతో తెలుగుదేశం పార్టీ పేచీ పెట్టుకుంటూ సమస్యల్లో చిక్కుకుంటోందని ప్రధాని మోదీయే పార్లమెంటులో వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్లయింది.

మొత్తం మీద పార్లమెంటులో తెలుగుదేశం, కాంగ్రెస్‌ మిత్రపార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగా, కొండను తవ్వినా ఏమీ సాధించలేకపోయినట్లుగా విపక్షాల పరిస్థితి మారింది. సభలో తగిన సంఖ్యా బలం లేకుండా, సరైన ముందస్తు సంసిద్ధత లేకుండా ఏ పార్టీ ఇలాంటి సాహసం చేసినా నవ్వులపాలవుతాయని అవిశ్వాసం తీర్మానం సందర్భంగా రుజువయ్యింది. ఇప్పటికైనా తెలుగుదేశం, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు బీజేపీ ప్రభుత్వంతో తలపడటంలో గుణపాఠం నేర్చుకోవలిసిన అవసరం ఎంతయినా ఉంది

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు,
ఫౌండర్, మేనేజింగ్‌ ట్రస్టీ,
రాఘవ ఫౌండేషన్, హైదరాబాద్‌
ఎస్‌.ఎస్‌. వరయోగి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement