సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. గంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన.. గతంలో కాంగ్రెస్‌పై చేసిన విమర్శలే ఇప్పుడు బీజేపీపైనా చేయటం విశేషం. ముందుగా భరత్ అనే నేను చిత్ర కథతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించిన.. ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్లారు. ‘ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన ఏపీకి తీవ్రమైన లోటు. మోదీ పాలనతో ఏపీ ఇబ్బందులకు గురయ్యింది. లక్షా 3 వేల కోట్ల రుణ భారం ఏపీపై పడింది. మేం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారు. విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది. ఆంధ్రపదేశ్‌కు రాజధాని, మౌలిక సదుపాయాలు లేవు’ అని వ్యాఖ్యానించారు. అయితే గల్లాజయ్ దేవ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. వెంటనే మేడమ్ స్పీకర్ జోక్యం చేసుకోవటంతో ప్రసంగం కొనసాగింది. ...
‘ఎన్నికలకు ముందు మోదీ ఏపీకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. తెలుగు తల్లిని కాంగ్రెస్ రెండు ముక్కలు చేసిందని మోదీ అన్నారు. నాలుగేళ్లుగా మోదీ ఏదో చేస్తారని ప్రజలు ఎదురు చూశారు. తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారని మోదీ అన్నారు. హోదా ఇస్తానని ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ముడిపెడుతున్నారు. మోదీ మోసం చేశారని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నెల్లూరు, విశాఖ, తిరుపతి సభల్లో మోదీ ఇచ్చిన హామీలకు విలువ లేదా?..
‘ఆర్థిక సంఘం సాకు చూపి ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించడం సరికాదు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఆర్థిక సంఘం సభ్యులు ఇచ్చారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదు. ఇది దేశాన్ని, ప్రజలను పక్కదారి పట్టించడమేనని భావిస్తున్నాం. ఏపీకి హోదా ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నారు. సభలో ఒక మాట.. బయట ఒక మాట్లాడటం సరికాదు’. మార్చి 15, 2018న హోదా గురించి రాజ్యసభలో మంత్రి అభిజిత్ మాట్లాడారు కూడా. హోదా ఇస్తానని మ్యానిఫెస్టోలో చెప్పిన బీజేపీ మొండిచేయి చూపించింది. హోదా కావాలని మేము అడిగితే.. దానికి సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారు’..‘పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నారు.. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తామన్నారు.. అది నామమాత్రమే. ఏపీ సంబంధించిన విషయాలు ప‍్రధాని కార్యాలయంలో ఆగిపోయాయి.’
మోదీపై సంచలన వ్యాఖ్యలు... ‘ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఏపీకి నిధులిస్తామన్న కేంద్రం హామీ ఏమైంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఎన్నో నిధులు రావాలి. ఢిల్లీ కంటే అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని మోదీ చెప్పారు. రూ. 1500 కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది??.ఇప్పుడు నిధులు లేమితో ఇబ్బందులు వస్తున్నాయి... అయితే మరోసారి టీఆర్‌ఎంపీలు ప్రసంగానికి అడ్డుపడ్డారు. మళ్లీ స్పీకర్ వారించటంతో ఆయన ప్రసంగం తిరిగి కొనసాగింది. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీపై గల్లా సంచలన ఆరోపణలు చేశారు. ‘అవినీతి పరులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారు. ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. హోదాపై మాట మార్చారన్న విషయం ప్రజలకు అర్థమైంది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనటం వాస్తవ విరుద్ధం. ప్రణాళిక సంఘం సాకుతో హోదా ఇవ్వకపోవటం సరికాదు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఒక్క పైసా ఏపీకి విదల్చలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలి’ అని గల్లా వ్యాఖ్యానించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది.
Comments
Please login to add a commentAdd a comment