
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసగిస్తున్న వైనాన్ని మూడేళ్ల క్రితం అసెంబ్లీలో ఎలుగెత్తిన సందర్భంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించిన అంశాలనే శుక్రవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొనటం గమనార్హం. జయదేవ్ మాట్లాడిన విషయాలను గమనిస్తే ముందు నుంచి హోదా విషయంలో మడమతిప్పని వైఎస్సార్ సీపీ వైఖరినే అనుసరించినట్లైంది. అలాగే చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో ప్రత్యేక హోదాకు 14 ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డు వచ్చాయని మోదీ చెప్పడం సరికాదన్నారు.
హోదా రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదు..
2015 సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి హోదా సాధించుకోవడంలో టీడీపీ సర్కారు మెతక వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ఇదే సమయంలో కేంద్రం చేస్తున్న మోసాన్ని కూడా ప్రస్తావించారు. ‘ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అసలు ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా తాము ఎక్కడా సిఫార్సు చేయలేదని స్వయంగా 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు..’ అని వైఎస్ జగన్ అసెంబ్లీలో ఆధారాలతో సహా వివరించారు. ‘ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా తాము ఎక్కడా సూచించలేదని కమిషన్ సభ్యులు అభిజిత్‌సేన్ లేఖ రాశారు.
మరో సభ్యుడు గోవిందరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు’ అని మూడేళ్ల క్రితమే వైఎస్ జగన్ శాసనసభ దృష్టికి తెచ్చారు. ప్రత్యేక హోదాకు మించి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందంటూ సీఎం చంద్రబాబు పేర్కొనడాన్ని జగన్ అప్పట్లోనే తప్పుబట్టారు. మూడేళ్ల క్రితం నాడు అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించిన అవే అంశాలను ఇప్పుడు పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ జయదేవ్, మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించడం విశేషం.