సాక్షి, అమరావతి: బీజేపీతో లోపాయికారీ ఒప్పందంతో అవిశ్వాస తీర్మానం పెట్టి లబ్ధి పొందాలని చూస్తే మొత్తానికి మునిగి పోయామని, పరువు పోగొట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందుతోంది. అవిశ్వాసం వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా ఇన్నాళ్లూ దాచిన రహస్యాలన్నీ పార్లమెంట్ సాక్షిగా బట్టబయలయ్యాయని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ‘‘అవిశ్వాసానికి వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్నాం.. చంద్రబాబు అమరావతి నుంచే చక్రం తిప్పుతున్నారు. తన అనుభవంతో విపక్షాలన్నింటినీ ఏకం చేస్తున్నారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వివిధ పార్టీలతో కలిసి కేంద్రాన్ని ఎండగడతాం.. ప్రధాని మోదీని నిలదీస్తాం’’ అంటూ హడావుడి చేసినా అదేమీ జరగలేదని టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. పార్లమెంట్‌లో ఇతర పార్టీల నుంచి మద్దతు లభించకపోగా, బీజేపీ వైఖరితో పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డామనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. లోక్‌సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చ తీరు మనకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని, చివర్లో జరిగిన పరిణామాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
మోదీ వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితి
చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లినా తమకు మిత్రుడేనని, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆయనతో స్నేహం ఉంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పడం ద్వారా టీడీపీ–బీజేపీ లోపాయికారీ వ్యవహారాలను తేటతెల్లం చేశాయని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లు అధికారంలో కొనసాగి, రాజకీయ లాభం కోసం బీజేపీ నుంచి విడిపోయినా రహస్యంగా ఆ పార్టీతో చంద్రబాబు అనుబంధం కొనసాగిస్తున్నారనే అనుమానాలు మొదటి నుంచే వ్యక్తమవుతున్నాయి.
ప్రధాని మోదీ ప్రసంగంతో తమ అధినేత బండారం మొత్తం బయటపడినట్లు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అంగీకారంతోనే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని, ఏపీలో సమస్యలు పరిష్కారం కాలేదని సాక్షాత్తూ ప్రధానమంత్రే చెప్పడం తమకు ఇబ్బందికరమేనని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలు తమ పార్టీకి మద్దతు ఇవ్వకపోగా, ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రస్తావించకపోవడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు వ్యూహం ఫలించలేదనే విషయం స్పష్టమవుతోందంటున్నారు.
ప్రజల దృష్టిని మళ్లిద్దాం..
తాజా పరిణామాలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు కూడా మదన పడుతున్నట్లు సమాచారం. ఉదయం నుంచి పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆయన మంత్రులతో మాట్లాడుతూనే తన అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ వాదనను లోక్‌సభలో సరిగ్గా వ్యక్తం చేయలేకపోయామని, అనుకున్న మైలేజీ రాలేదని అంటున్నట్లు సమాచారం. మోదీ నేరుగా తనను టార్గెట్ చేసి మాట్లాడుతారని తాను ఊహించలేదని ఆయన వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోదీ మాట్లాడిన తర్వాత నష్ట నివారణ కోసం అర్ధరాత్రి 12 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment