ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు.. ఇకనైనా మారండి | Narendra Modi No Confidence Motion in Lok sabha | Sakshi
Sakshi News home page

అవును..భాగీదార్‌నే!

Published Sat, Jul 21 2018 2:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Narendra Modi No Confidence Motion in Lok sabha - Sakshi

శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి బదులిస్తున్న ప్రధాని మోదీ

ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో వాడి, వేడి చర్చ జరిగింది. కొన్ని నాటకీయ పరిణామాలూ చోటు చేసుకున్నాయి. చర్చలో పాల్గొన్న విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పలు ప్రజా సమస్యలపై తూర్పారపట్టాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. చౌకీదార్‌(కాపలాదారుడు)నని చెప్పుకునే ప్రధాని.. నిజానికి అవినీతి, అక్రమాల్లో భాగీదార్‌(భాగస్వామి) అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూకదాడులు, మహిళలపై హింస, రాఫెల్‌ ఒప్పందంలో లొసుగులు సహ పలు అంశాలను లేవనెత్తారు. చివరగా, తనపై బీజేపీకి ఎంత కోపం ఉన్నా.. తనకు మాత్రం వారిపై వీసమెత్తు ద్వేషం కూడా లేదంటూ ప్రసంగాన్ని ముగించారు.

అనంతరం అకస్మాత్తుగా ప్రధాని మోదీ కూర్చున్న స్థానం వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. ఆ తరువాత తన సీట్లో కూచుని సహచరుడిని చూస్తూ నవ్వుతూ రాహుల్‌ కన్నుగొట్టారు. విపక్ష సభ్యుల ప్రసంగాల అనంతరం చర్చకు మోదీ సమాధానమిచ్చారు. రాహుల్‌ సహా విపక్షాల విమర్శలకు తనదైన శైలిలో, దీటుగా బదులిచ్చారు. రాహుల్‌ కౌగిలింతను, కన్నుగీతనూ ప్రస్తావించారు. పనిలోపనిగా, అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ‘యూటర్న్‌’ పాలసీనీ సభకు తేటతెల్లం చేశారు. మోదీ ప్రసంగం అనంతరం జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వ పక్షం సునాయాసంగా గెలిచింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.  

న్యూఢిల్లీ: విపక్షాలపై పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాల తీరును ఎండగట్టారు. అవిశ్వాసం పేరుతో నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయేని గద్దె దించేందుకు అందరూ ఏకమవుతున్నారని.. వారెన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించబోరన్నారు. ఎవరినైనా గద్దె దించే బాధ్యత 125 కోట్ల ప్రజలదేనన్నారు. 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దేశ ప్రజలనే అవమానించారన్నారు. తమవి ఓటుబ్యాంకు రాజకీయాలు కావన్న ప్రధాని.. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ నినాదంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నారు. ప్రధాని పీఠంలో కూర్చోవాలని రాహుల్‌ అనుకుంటున్నారని.. దీనికి అంత తొందర అవసరం లేదని ఎద్దేవా చేశారు. విపక్షాలకు అవిశ్వాసం అవకాశం ఇకపై ఉండదని.. వీలుంటే 2024లో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీకు నా శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు.  

డోక్లాం, రాఫెల్‌ డీల్‌లపై..
భారత్‌–చైనాల మధ్య విభేదాలకు కారణమైన డోక్లాం వివాదం నెలకొన్న విషయంలో రాహుల్‌ గాంధీ వ్యవహరించిన తీరునూ సభా వేదిక ద్వారా మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఆయనకేమైనా సందేహాలుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కానీ చైనా రాయబారితో సమావేశమయ్యారు. ఇది దేశాన్ని అవమానించడం కాదా?’ అని మోదీ ప్రశ్నించారు. చైనా రాయబారితో మాట్లాడి రాహుల్‌ దేశం పరువుతీశారన్నారు. రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలోనూ కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు దారుణమని ప్రధాని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన  ఎలా వ్యవహరించాలో కూడా వారికి తెలియదన్నారు. ‘ప్రజలు మిమ్మల్ని విసుక్కుంటున్నారు. కనీసం ఇప్పటికైనా మారండి. రాఫెల్‌ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం. రాజకీయ పార్టీల మధ్య కాదు.. రెండు బాధ్యతగల ప్రభుత్వాల మధ్య జరిగింది. అది కూడా పూర్తి పారదర్శకంగా. మీరు చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ప్రకటనలు విడుదల చేయాల్సి వచ్చింది’ అని మోదీ మండిపడ్డారు.  

జవాన్లకూ అవమానమేనా?
 సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఓ బూటకమని రాహుల్‌ వ్యాఖ్యానించడంపై ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు. ‘దేశ సైన్యాధ్యక్షుడిపై ప్రయోగించే భాష విషయంలో.. సైనికుల త్యాగాలను గుర్తించే విషయంలోనూ అవమానకరంగా మాట్లాడతారా? సర్జికల్‌ దాడులు అబద్ధమంటారా? ప్రాణాలకు తెగించి సరిహద్దులు కాపాడుతు న్న వారిని గౌరవించడం నేర్చుకోండి’ అని మోదీ ఘాటుగా అన్నారు.  

ఓటుకు నోటిచ్చి..
అవిశ్వాస తీర్మానం ఇచ్చాక తమ వద్ద సరిపోయేంత సంఖ్య ఉందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొనడాన్ని మోదీ ఎద్దేవా చేశారు. సంఖ్యాబలం లేదన్న విలేకరులపై మీకెవరు చెప్పారంటూ జవాబిచ్చిన అహంకారాన్ని చూడండన్నారు. 1999లోనూ అవిశ్వాస తీర్మానం అనంతరం అవసరమైన బలముందని తప్పుడు లెక్కలు చెప్పి కంగుతిన్నదెవరో ప్రజలు మరిచిపోలేదన్నారు. 1971లో చరణ్‌ సింగ్‌కు మద్దతిస్తామని చెప్పి తర్వాత చేయిచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. దేవేగౌడ, గుజ్రాల్, ములాయం సింగ్‌ ఇలా ప్రముఖులందర్నీ కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్‌.. ఓటుకు నోటు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందని గుర్తుచేశారు.  

సౌదాగర్‌ను మాత్రం కాను!
‘చౌకీదార్‌నని చెప్పుకున్న మోదీ.. అవినీతిలో భాగీదార్‌ (భాగస్వామి)గా మారిపోయార’న్న రాహుల్‌ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. తను చౌకీదార్‌నేనని.. రాహుల్‌ చెప్పినట్లుగా తను భాగీదార్‌ని కూడానన్నారు. దేశానికి చౌకీదార్‌గా పనిచేయడంతోపాటు.. దేశం యువత సాధిస్తున్న విజయాల్లో, రైతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో దేశాన్ని కొత్త దిశలో తీసుకెళ్లడంలో తను భాగీదార్‌నే అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లాగా సౌదాగర్‌ (వ్యాపారి) ను మాత్రం కాదన్నారు. తప్పుడు వార్తనలు ప్రచారం చేసి జనాల్లో భయాందోళనలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు.

2014లో ఆర్థికంగా అస్తవ్యస్తం
‘బీజేపీ అధికారంలోకి రాగానే.. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. లెక్కలు చూస్తుంటే ఒకదాని తర్వాత మరొక ఆశ్చర్యం కలిగించే అంశాలు బయటకొచ్చాయి. 2008లో మొదలైన కాంగ్రెస్‌ లూటీ 2014వరకు నిర్విఘ్నంగా సాగింది’ అని మోదీ వెల్లడించారు. 60 ఏళ్ల భారతంలో దేశంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) రూ.18లక్షల కోట్లుంటే.. 2008 నుంచి 2014 మధ్యలో ఈ మొత్తం రూ.52లక్షల కోట్లకు చేరిందనే విషయాన్ని మోదీ బయటపెట్టారు. తమ ప్రభుత్వం ఎన్‌పీఏలను సమీక్షించడంతోపాటు.. బ్యాంకింగ్‌ రంగానికి రూ. 2.10 లక్షల కోట్ల మూలధనాన్ని ఇచ్చిందన్నారు. దివాళా చట్టాన్ని, రుణ ఎగవేతదారుల చట్టాన్ని తీసుకొచ్చి అమలుచేస్తున్నామన్నారు.

మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే..
బీజేపీ అధికారంలోకి రాకముందు గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మోదీ విమర్శించారు. నాలుగేళ్లలోనే 18వేల గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తయిందన్నారు. పేదలు బ్యాంకు అకౌంట్లు తెరుచుకుని రూ.80వేల కోట్లు దాచుకున్నారని తెలిపారు. ప్రజాసంక్షేమ పథకాల వల్ల దేశంలో పేదరికం తగ్గుతోందంటూ అంతర్జాతీయ సూచీలు వెల్లడిస్తున్నాయన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ తో బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చనున్నామన్నారు. భీమ్‌ యాప్‌ ద్వారా 41వేల కోట్ల లావాదేవీలు జరిగి.. ప్రజలు దేశవ్యాప్తంగా ఓ సానుకూల మార్పుకు సిద్ధమవుతున్నా.. విపక్షాలకు ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు. దేశానికి, ప్రపంచానికి, దేశంలోని సుప్రీంకోర్టు, రిజర్వ్‌ బ్యాంకు, కాగ్, ఎన్నికల సంఘం వంటి ఉన్నత సంస్థలకు తమపై నమ్మకముందన్న మోదీ.. పిడికెడు మందికే తమపై విశ్వాసం లేక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు.  

ప్రధాని ప్రసంగం పేలవం: రాహుల్‌
ప్రధాని ప్రసంగం పేలవంగా, బలహీనంగా ఉందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంటు నుంచి రాహుల్‌ బయటకు వస్తున్నప్పుడు విలేకరులు ‘మోదీ ప్రసంగం ఎలా ఉంది?’ అని అడగ్గా రాహుల్‌ ‘బలహీనం’అని చెప్పారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా కూడా మోదీ ప్రసంగం ఎప్పటిలా వాగాడంబరంలా, నిజాలను దాచి ప్రజలను మభ్యపెట్టేలా ఉందన్నారు.

కళ్లలోకి చూసే సాహసం చేయలేను
ప్రధాని తన కళ్లలోకి చూడలేక పోతున్నారన్న రాహుల్‌ వ్యాఖ్యలపై మోదీ మాట్లా డుతూ.. ‘మీరు గొప్ప పేరున్న వారు (నామ్‌దార్‌). నేను పనివాడిని  (కామ్‌దార్‌). మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూసేంత సాహసం చేయలేను. సర్దార్‌ పటేల్, సుభాష్‌ చంద్రబోస్, చంద్ర శేఖర్, మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్‌ నారాయణ్, చరణ్‌ సింగ్, ఐకే గుజ్రాల్, ప్రణబ్‌ ముఖర్జీ, దేవెగౌడ తదితర నేతలంతా మీ కళ్లలో కళ్లు పెట్టి చూసేందుకు యత్నించారు. ఫలితం ఏంటో, వాళ్లకెంతటి అవమానాలు జరిగాయో అందరికీ తెలుసు. శరద్‌ పవార్‌ కూడా ఇదే యత్నం చేస్తే ఏం చేశారో తెలియదా? కళ్లలో కళ్లు పెట్టేవారిని ఎలా అవమానించారో.. ఒక కుటుం బం కోసం.. ఏం చేశారో దేశమంతటికీ తెలుసు’ అని అన్నారు.

వీగిపోయిన అవిశ్వాసం
లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం వీగిపోయింది. అధికార, ప్రతిపక్షాలు 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఓటింగ్‌ సమయంలో టీఆర్‌ఎస్, బీజేడీ, శివసేన సభ్యులు సభలో లేరు.  

ఎవరేమన్నారంటే...
విభజన చట్టం హామీల్ని నెరవేర్చలేదు: కాంగ్రెస్‌
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా ముందుకు పోతోందని ఆరోపించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏపీ పునర్విభజన చట్టం–2014లో చేర్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వలేదు. అలాగే చట్టంలోని ఇతర కీలకమైన హామీల్ని నెరవేర్చలేదు. మోదీ ప్రభుత్వం విభజించు–పాలించు అనే విధానాన్ని అనుసరిస్తోంది. ఎప్పుడూ అదానీలు, అంబానీల గురించి మాట్లాడే మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కనీసం పట్టించుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు సంగతేమో కానీ రైతన్నల ఆత్మహత్యలు మాత్రం భారీగా పెరిగాయి. మీకు(మోదీకి) పెద్ద మనసు లేకపోయినా ప్రజాస్వామ్యంపై చాలా పెద్దపెద్ద మాటలు చెబుతారు. విదేశాల్లో మూలుగుతున్న రూ.80 లక్షల కోట్లను తెచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు ఎప్పుడు డిపాజిట్‌ చేస్తారు? మోదీ అధికారం నుంచి దిగిపోతేనే దేశానికి మంచిరోజులు వస్తాయని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు’ అని అన్నారు.

2019 ఎన్నికల్లో బీజేపీకి పరాజయమే: టీఎంసీ
నియోజకవర్గాల వారీగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీచేస్తే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేత సౌగత రాయ్‌ చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాయ్‌ లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘అధికార బీజేపీ ఇప్పటికే మిత్రపక్షాలు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రభుత్వంపై ఎన్డీయే కూటమి నుంచి బయటికెళ్లిన మిత్రపక్షం టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, మరో మిత్రపక్షం శివసేన ఈ చర్చల్ని ఏకంగా బహిష్కరించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలనాథులు కచ్చితంగా చిత్తుగా ఓడిపోతారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల కూటమి, బీజేపీ మధ్య ద్వైపాక్షిక పోటీ మాత్రమే ఉండనుంది’ అని విమర్శించారు.

తమిళనాడుపై సవతితల్లి ప్రేమ: అన్నాడీఎంకే
నిధుల కేటాయింపులో తమిళనాడుపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని చర్చ సందర్భంగా అన్నాడీఎంకే నేత పి.వేణుగోపాల్‌ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో తమిళనాడు వాటా గణనీయంగా ఉంటోంది. కానీ ఇందుకు ప్రతిఫలంగా మాకు చాలా తక్కువ నిధులు లభిస్తున్నాయి. జనాభా నియంత్రణతో పాటు ఆర్థిక పురోగతి సాధించిన తమిళనాడును కేంద్రం శిక్షిస్తోంది. నిధుల కేటాయింపు విషయంలో మోదీ ప్రభుత్వం తమిళనాడుపై సవతితల్లి ప్రేమను చూపుతోంది. దేశంలో నదీజలాల వివాదాలను పరిష్కరించకుండా కేంద్రం డ్యామ్‌ భద్రతా బిల్లును తీసుకురాకూడదు’ అని వేణుగోపాల్‌ అన్నారు.

నల్లధనం డిపాజిట్లు 50% పెరిగాయ్‌: సీపీఎం
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమయిందని సీపీఎం నేత మొహమ్మద్‌ సలీం విమర్శించారు. ‘2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. కానీ ఒక్క 2017లోనే స్విస్‌ బ్యాంక్‌లలో భారతీయుల నల్లధనం 50 శాతం మేర పెరిగింది. అప్పుడు నల్లధనం తెస్తామన్న వాళ్లు ఇప్పుడేమో అదంతా తెల్లధనమేనని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. నల్లధనం జమయింది కానీ ఎంతమొత్తం వచ్చిందో మాత్రం ఇంకా తెలియదని ఆర్థికమంత్రి సెలవిస్తారు.  గత 70 ఏళ్లలో జరగని దాన్ని నాలుగేళ్లలో చేసి చూపామని బీజేపీ నేతలు ఓసారి అంటారు. మరోవైపు గత 70 ఏళ్లలో దేశం సర్వనాశనమైపోయిందని వాళ్లే చెబుతారు. అంటే గత 70 ఏళ్లలో జరిగిన వినాశనాన్ని బీజేపీ నేతలు నాలుగేళ్లలోనే చేసి చూపారా?’ అని సలీం విమర్శనాస్త్రాలు సంధించారు.

రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు: ఎస్పీ
బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు, వ్యాపారులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో సంతోషంగా ఉన్నవాళ్లు ఒక్కరూ లేరు. చివరికి బీజేపీ నేతలు కూడా సంతోషంగా లేరు. తమ రాజకీయ జీవితాలు నాశనమైపోయాయని వాళ్లంతా బాధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. దేశంలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, నీళ్లు, రవాణా ప్రతిఒక్కటీ ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. కేంద్రం నిర్ణయాలతో నిరుద్యోగ యువతతో పాటు రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు’ అని ములాయం పేర్కొన్నారు.

మూకహత్యలపై మోదీ మౌనం: ఎన్సీపీ
దేశంలో మైనారిటీలు, దళితుల్ని అల్లరిమూకలు కొట్టిచంపడంపై ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని ఎన్సీపీ నేత తారిఖ్‌ అన్వర్‌ విమర్శించారు. ‘దేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అమాయకుల్ని అల్లరిమూకలు కొట్టిచంపుతుంటే ప్రధాని మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), ఆదాయపు పన్ను శాఖ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది’ అని విమర్శించారు.


                   అవిశ్వాస తీర్మానంపై చర్చను వింటున్న సోనియా గాంధీ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement