
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీని ఉపాధి అడిగితే పకోడి చేసుకోమన్నారంటూ రాహుల్ విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రధాని హామీలకు విలువ ఉండాలన్న రాహుల్.. నేడు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ తరపున ప్రసంగించిన రాహుల్.. మోదీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
‘భారతీయ యువత ప్రధాని మోదీపై నమ్మకం పెట్టుకుంది. అదే క్రమంలో ఉపాధి అడిగితే పకోడి చేసుకోమని మోదీ సలహా ఇచ్చారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. మేము జీఎస్టీని తెస్తామని అప్పుడే చెప్పాం. కానీ మోదీ వ్యతిరేకించారు. చిన‍్న తరగతి, మధ్య తరగతి ప్రజలను కేంద్రం పట్టించుకోవడం లేదు. కార్పోరేట్లు, బడా వ్యక్తులకే మోదీ ప్రధాన్యత ఇస్తున్నారు. దేశానికి సేవకునిగా ఉంటానని మోదీ అన్నారు. ప్రధాని మోదీ గారడీ మాటలతో ప్రజలు మోసపోయారు. పది మంది కుబేరులు కోసం మాత్రమే మోదీ పనిచేస్తారు. పెద్ద పెద్ద వ్యాపారులను మాత్రమే మోదీ కలుస్తారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అక‍్రమాలు జరిగాయి. రఫెల్ ఒప్పందం పత్రాలపై మోదీ జవాబివ్వాలి. రఫెల్ ఒప్పందంపై రక్షణమంత్రి అబద్ధాలు ఆడుతున్నారు’ అని రాహుల్ విమర్శించారు.
రాహుల్ ఇంకా ఏమన్నారంటే...
*మోదీ మనసులో పేదవాడికి చోటు ఉండదు
*అమిత్ షా కుమారుడు ఆస్తుల విలువను 3 నెలల్లో 16వేల రెట్లు పెంచుకుంటే మోదీ నోటి నుంచి ఒక్క మాటరాదు
*ప్రధాని ఒత్తిడితోనే మంత్రి నిర్మలా సీతారామన్ రఫెల్ యుద్ధ విమానాల ధరల వివరాలను బహిర్గతం చేయడం లేదు
*రఫెల్ ఒప్పందంపై వాస్తవాలను ప్రజల ముందు బయటపెట్టాలి
*మోదీ సన్నిహితులకు లబ్ధి చేకూరేలా రఫెల్ కాంట్రాక్టులు ఇచ్చారు
*ఒక్క రఫెల్ యుద్ధ విమనాల కాంట్రాక్ట్‌లోనే రూ. 45 వేల కోట్ల అవినీతి జరిగింది
*ప్రధాని నవ్వుతూ కనిపిస్తున్నా లోపల అసహనం ఉంది
*ప్రధాని సూటిగా నా కళ్లలోకి చూడలేకపోతున్నారు
*కాపలాదారుడు.. భాగస్వామి అని దేశం అర్థం చేసుకుంది
*చైనా అధ్యక్షుడితో గుజరాత్‌లో ఊయలు ఊగితుంటే.. వేల మంది చైనా సైనికులు భారత్‌లో చొరబడ్డారు
*మన సైనికులు ధైర్యంగా చైనా సైనికుల్ని ఎదిరించారు
*కోటీశ్వరులకి రుణ మాఫీలు చేస్తున్నారు
*రైతుల రుణాలను మాఫీ చేయమంటున్నారు
*మోదీ హయాంలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
*మహిళలపై గ్యాంగ్ రేప్‌లు పెరిగిపోయాయి
*దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి
*దాడులపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరు
*దాడులు చేసిన వారిని కేంద్ర మంత్రి అభినందిస్తారు
* మోదీ- అమిత్ షా వ్యవహార శైలితో దేశానికి తీవ్ర నష్టం
Comments
Please login to add a commentAdd a comment