పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు. చిత్రంలో బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో మళ్లీ అదే తీరు. వరుసగా పదకొండోసారి అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. సభ ఆర్డర్‌లో లేదన్న కారణం చూపుతూ బుధవారం కూడా అవిశ్వాస తీర్మానాలను అనుమతించకుండానే స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన లోక్‌సభ కొద్దిక్షణాలకే వాయిదా పడింది. కావేరీ నదీజలాల యాజమాన్య బోర్డు కోసం అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోనే ఆందోళన చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. అయితే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ సమయంలో అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ ప్రస్తావించారు. వైఎస్సార్‌సీపీతోపాటు పలు పార్టీల ఎంపీల నుంచి తనకు అవిశ్వాసంపై నోటీసులు వచ్చినట్టు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సభ్యుల బలాన్ని లెక్కించేందుకు వీలుగా సహకరించాలని కోరారు. అయినప్పటికీ అన్నాడీఎంకే ఆందోళన కొనసాగడంతో సభ సజావుగా లేదని స్పీకర్ పేర్కొంటూ అవిశ్వాస తీర్మానాన్ని సభ ముందుకు తేలేకపోతున్నానని ప్రకటించారు. సభను గురువారానికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి.
మళ్లీ నోటీసులిచ్చిన వైఎస్సార్‌సీపీ సభ్యులు: ఇదిలా ఉండగా, వైఎస్సార్‌సీపీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం పన్నెండోసారి అవిశ్వాస తీర్మానానికి నోటీసు లిచ్చారు. గురువారం నాటి సభాకార్యక్ర మాల జాబితాలో చేర్చాలని కోరారు. అంతకుముందు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వీరికి సంఘీభావం తెలిపారు.
రాజ్యసభలో విజయసాయిరెడ్డి: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో ఆందోళన నిర్వహించారు. హోదా డిమాండ్ తో కూడిన ప్లకార్డును ఆయన ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment