కొవ్వూరు ఆర్డీఓకి అవిశ్వాస తీర్మానం నోటీసు అందిస్తున్న ఎంపీటీసీలు ,పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖ
పశ్చిమగోదావరి, పెనుగొండ : పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖపై ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్డీఓ ఫార్మాట్‌లో మండలంలోని 18 మంది ఎంపీటీసీలు, ఓ కోఆప్షన్ సభ్యుడు అవిశ్వాస తీర్మానాన్ని కొవ్వూరు ఆర్డీఓ వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణకు గురువారం అందించారు. ఎంపీపీ పదవికి రాజీనామాపై ఇరువర్గాల మధ్య ఏడాది కాలంగా రగడ జరుగుతోంది. ఎంపీపీ పదవిని అయిదేళ్లలో రెండు భాగాలుగా ఇద్దరు పంచుకోవాలని మొదట్లో నిర్ణయించుకున్నారు. మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖకు, రెండవ భాగంలోని రెండున్నర సంవత్సరాలు చీకట్ల భారతికి కేటాయించాలని అనుకున్నారు. ఒప్పందం ప్రకారం జనవరి 5వ తేదీ 2017 నాటికి పల్లి జూలీ సురేఖకు పదవీ కాలం ముగిసింది.
అయితేఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేదని, ఎన్నికల అనంతరం బలవంతంగా ఒప్పందం చేశారని ఆరోపిస్తూ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేయడానికి ససేమిరా అనడంతో వివాదం ఏర్పడింది. టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నించినా ఆమె రాజీనామా చేయలేదు. దీంతో మండల పరిషత్‌లోని నిబంధనల ప్రకారం నాలుగేళ్లు దాటితే గాని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో ఇప్పటి వరకూ వేచి చూశారు. జూలై 4తో నాలుగేళ్లు ముగిసిన తరుణంలో ఎంపీటీసీలు అందరూ సమావేశమై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి నిర్ణయించారు. తొలుత అధికార టీడీపీ పక్ష ఎంపీటీసీలతో పాటు, బీజేపీ, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల నుంచి సంతకాలు సేకరించారు.
అయితే ఆర్డీఓ నేరుగా కొవ్వూరులోనే సంతకాలు పెట్టాలని సూచించడంతో అవిశ్వాస తీర్మానంపై అందుబాటులో ఉన్న 18 మంది ఎంపీటీసీలు గురువారం కొవ్వూరు వెళ్లి ఆర్డీఓకు సంతకాలు చేసిన లేఖను అందించినట్లు తెలిసింది. 15 రోజులలో నోటీసులు జారీ చేసి సమావేశం ఏర్పాటు చేస్తానని ఆర్డీఓ ఎంపీటీసీలకు హామీ ఇవ్వడంతో వారు వెనుతిరిగారు. ఎంపీటీసీల నందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో పెనుగొండ, ఆచంట ఏఎంసీ చైర్మన్‌లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్ బాబు, జడ్పీటీసీ రొంగల రవికుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు వెలిచేటి బాబూ రాజేంద్ర ప్రసాద్‌లు గట్టి కృషి చేశారని అంటున్నారు. అవిశ్వాస తీర్మానం కారణంగా తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన విభేదాలు ముందుముందు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment